తుమ్మిడిహట్టి, ఆగస్టు 26: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం తరువాత ఒక్క ఎకరాకు నీళ్లు అయిన ఇచ్చారా? అని సీయల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పదహారున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు, తాగు నీరు, హైదరాబాద్‌లో ఉన్న పరిశ్రమలకు అవసరమైన నీరు అందేలా రూపొందించారని అన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.38 వేల కోట్ల ఖర్చుతో ఈపీసీ కింద కాంట్రాక్టుకు పనులు అప్పగించారని ఆయన చెప్పారు. ఈపీసీ కింద ప్రభుత్వం కాంట్రాక్టుకు ఇవ్వడం వలన.. ఖర్చులు పెరిగినా ప్రభుత్వానికి సంబంధం లేకుండా.. ప్రాజెక్టును పూర్తి చేసి ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉండేదని అన్నారు. అప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చెసిందని ఆయన చెప్పారు. ‘తెలంగాణ వచ్చి ఇప్పటికి ఆరేళ్ళు అయింది.. ఏడాదికి 10 వేల కోట్లు ఖర్చుపెట్టినా.. మూడేళ్ళలో ప్రాజెక్టు పూర్తయి.. మూడేళ్ళుగా పదహారున్నర లక్షల ఎకరాలకు నీళ్లు పారేవి’ అని అన్నారు. మొత్తం తెలంగాణలోని 80 శాతం ప్రాంతానికి తాగునీరు లభించేదని కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఈపీసీ పద్ధతిలో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టు వలన కమీషన్లు రావని.. ఈ ప్రాజెక్టును చంపేసి కాళేశ్వరం చేపట్టారని అన్నారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం చిన్న లిఫ్ట్ పెట్టుకుని గ్రావిటీ ద్వారా.. నీటిని దిగువకు పంపించే అవకాశం ఉండేదని అన్నారు.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » ‘ప్రాణహిత’ చంపేసి.. ప్రాజెక్టు వ్యయం పెంచేశారు..