మన బాపుబొమ్మ ప్రణీత అమ్మగా ప్రమోషన్ పొందింది. ఏం పిల్లో ఏం పిల్లాడో చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ప్రణీత.. అతి తక్కువ కాలంలోనే మంచి పేరును తెచ్చుకుంది. అత్తారింటికి దారేదిలో పవన్ సరసన నటించి టాలీవుడ్ అభిమానుల్లో మంచి మార్కులు కొట్టేసింది ఈ బాపు బొమ్మ.
కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్తను ఆమె వివాహం చేసుకుంది. గతేడాది అక్టోబర్ లో తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ప్రణీత… ఎప్పటికప్పుడు తన చిత్రాలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. సీమంతం, బేబిబంప్ చిత్రాలను ఎప్పటికప్పుడు నెట్టింట్లో షేర్ చేసేది.
‘‘ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. గత కొద్ది రోజుల ముందు నుంచి ఎన్నో క్లిష్ట పరిస్థితులను అనుభవించాను. చివరికి ఈరోజు మా ముద్దుల బిడ్డ నాకు పుట్టేసింది. ఈ సమయంలో మా అమ్మ నా పక్కనే ఉండి ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఆమె ఒక గైనకాలజిస్టు అయినప్పటికీ, తల్లిగా ఆమె ఎంతో ఎమోషనల్ అయ్యారు’’ అంటూ డెలివరీ విషయాలను పంచుకుంది ప్రణీత.
తన ప్రసవం సమయంలో ఎంతో ధైర్యాన్నిచ్చి, తేలికగా అయ్యేలా చేసిన డాక్టర్ సునీల్ ఈశ్వర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నానని.. తన పాపతో ఉన్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దీంతో అవి కాస్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇటు సినీ ప్రముఖులు, అభిమానులు ప్రణీతకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.