న్యూఢిల్లీ టెలివిజన్.. ఎన్డీటీవీ వ్యవస్థాపకులు, ఈ సంస్థ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికా రాయ్ ..ప్రమోటర్ల గ్రూపయిన ఆర్ఆర్ పీఆర్ హెచ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా రాజీనామా చేశారు. ఈ సంస్థలో ఈ గ్రూప్ కి 29.18 శాతం షేర్ ఉంది. ఈ నెల 29 న జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశంలో వీరి రాజీనామాలను ఆమోదించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. నవంబరు 29 న సంస్థ కార్యకలాపాలు ముగిసిన వెంటనే వీరి రాజీనామాలు అమలులోకి వచ్చినట్టు పేర్కొన్నాయి.
వీరి స్థానే ఆర్ఆర్ పీఆర్ హెచ్ బోర్డు డైరెక్టర్లుగా సుదీప్ భట్టాచార్య, సంజయ్ పుగాలియా, సెంథిల్ సిన్నియా చంగల్వరాయన్ తక్షణమే నియమితులైనట్టు వివరించాయి. తమ ఈక్విటీ కేపిటల్ లో 99.5 శాతం షేర్లను అదానీ గ్రూపు ఆధ్వర్యంలోని విశ్వ ప్రధాన్ కమర్షియల్ సంస్థకు బదలాయించినట్టు ఆర్ఆర్ పీఆర్ హెచ్ హోల్డింగ్ కంపెనీ నిన్న ప్రకటించింది.
దీంతో అదానీ గ్రూపు … ఎన్డీటీవీ ని అధికారికంగా టేకోవర్ చేసినట్లయింది. ఇక ఎన్డీటీవీ షేర్లపై అదానీ గ్రూప్ ‘ఆధిపత్యమే’ కొనసాగనుంది. ఈ సంస్థలోని మరో 26 శాతం వాటా కోసం కూడా అదానీ గ్రూపు ఓపెన్ ఆఫర్ పెట్టిందని, ఈ నెల 22 న మొదలైన ఈ ప్రక్రియ డిసెంబరు 5 న ముగుస్తుందని తెలిసింది.
సంస్థను తాము పూర్తిగా టేకోవర్ చేసుకునేంతవరకు చైర్మన్ గా ప్రణయ్ రాయ్ కొనసాగాలని అదానీ గ్రూప్ కోరినట్టు తెలుస్తోంది. అయితే బోర్డు డైరెక్టర్లుగా ప్రణయ్ రాయ్ దంపతులు రాజీనామా చేసినప్పటికీ లీగల్ గా వీరు ఈ సంస్థ ప్రమోటర్లుగానే ఉంటారని తెలిసింది. 2009 లో వీరు రిలయన్స్ ఇండస్ట్రీకి అనుబంధంగా ఉన్న సంస్థ నుంచి వడ్డీ లేని రుణంగా రూ. 400 కోట్లను తీసుకున్నారు. ఆ సంస్థే చివరకు విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ గా మారింది. ఈ రుణాన్ని మంజూరు చేయడం ద్వారా ఈ సంస్థ 29.2 శాతం వాటాను కలిగి ఉన్న ఆర్ఆర్ పీఆర్హెచ్ హోల్డింగ్స్ లోవారంట్లను షేర్లుగా మార్చుకునే అర్హతను సాధించింది. గత ఆగస్టులో అదానీ గ్రూపు విశ్వప్రధాన్ సంస్థను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఈ వారంట్లను షేర్లుగా మార్చుకోదలిచింది. మొదట ఇందుకు ఎన్డీటీవీ ప్రమోటర్లు విముఖత వ్యక్తం చేసినప్పటికీ ఆ తరువాత ఈ మార్పిడికి అనుమతించారు.
‘ఇక ఆ ఛానెల్ చూడను’.. కేటీఆర్
ఎన్డీటీవీ డైరెక్టర్ల బోర్డు నుంచి ప్రణయ్ రాయ్ దంపతులు రాజీనామా చేసినట్టు వచ్చిన వార్తపై స్పందించిన టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ఇక ఆ ఛానల్ చూడబోనని ట్వీట్ చేశారు. ఆ ఛానెల్ ను ‘అన్ ఫాలో చేసేస్తున్నా’ అన్నారు. ఇప్పటివరకు ఎన్డీటీవీ ఛానెల్ లో మంచి వార్తలు ప్రసారం చేశారన్నారు.