ఏపీలో మోటార్లకు మీటర్లు పెట్టడంపై తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్రం ఇచ్చే రూ.5 వేల కోట్ల రుణ పరిమితికి ఆశపడి ఏపీలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నారని మంత్రి విమర్శించారు. బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏపీలో వచ్చే 6 నెలల్లో విద్యుత్ మీటర్లు పెట్టడం పూర్తి చేస్తామని అక్కడి మంత్రి అంటున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కేంద్రం ఆశ చూపించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం మోటార్లకు మీటర్లు పెట్టే విషయంలో ఒప్పుకోలేదన్నారు. రూ.5 వేల కోట్లు ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ రైతులే తనకు ముఖ్యమని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పినట్లు మంత్రి వివరించారు.
అలాగే, పాలమూరుకు నీళ్లు రాకుండా కృష్ణా జలాల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని మంత్రి విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం ఇవ్వలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్‌లు తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా తెప్పించాలని డిమాండ్ చేశారు.
ఇక వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల వీడియోను టీడీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్ చేసింది. ‘రూ.5 వేల కోట్ల అప్పు కోసం, రైతుల మెడకు జగన్ రెడ్డి ఎలా ఉరితాడు వేసాడో, పక్క రాష్ట్ర మంత్రి చెప్తున్నాడు వినండి. చంద్రబాబు గారు ఇదే చెప్తుంటే విమర్శలు చేస్తున్న వైసీపీ మంత్రులు, ఇప్పుడేమంటారు..?’ అంటూ టీడీపీ ప్రశ్నించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షం టీడీపీతో పాటు మిగిలిన విపక్ష పార్టీలు కూడా మండిపడుతున్నాయి.
రూ.5 వేల కోట్ల అప్పు కోసం, రైతుల మెడకు జగన్ రెడ్డి ఎలా ఉరితాడు వేసాడో, పక్క రాష్ట్ర మంత్రి చెప్తున్నాడు వినండి. చంద్రబాబు గారు ఇదే చెప్తుంటే విమర్శలు చేస్తున్న వైసీపీ మంత్రులు, ఇప్పుడేమంటారు ? pic.twitter.com/whx8mykC3x
— Telugu Desam Party (@JaiTDP) May 13, 2022