కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో పీకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం తన శ్వాస, ధ్యాస అంతా బీహార్ బలోపేతమేనని అన్నారు. బీహార్ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పుడేమీ ఎన్నికలు లేవని.. ఇప్పట్లో రాజకీయ పార్టీని స్థాపించే ప్రణాళిక ఏదీ లేదన్నారు.
అక్టోబర్ 2 నుంచి 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు పీకే. ఈ యాత్రలో వీలైనంత మందిని కలవనున్నట్లు చెప్పారు. రాబోయే మూడు, నాలుగేళ్లు ప్రజలకు చేరువయ్యే పనిలో నిమగ్నం కానున్నట్లు వివరించారు. ఇక నుంచి తాను పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ను కానని.. ఐ ప్యాక్ సంస్థకు తనకు ఎలాంటి డైరెక్ట్ సంబంధం లేదని ప్రకటించారు.
దాదాపు ఏడాదిపాటు సాగే పాదయాత్రలో రాష్ట్రంలోని ప్రతి తలుపు తడతానని పేర్కొన్నారు ప్రశాంత్ కిశోర్. సుపరిపాలన అంటే ఏంటో ప్రజలకు తెలియజేస్తానని… గతంలో చేసిన తప్పును మళ్లీ చేయబోనని నితీష్ కుమార్ కు ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా పని చేసిన విషయం గురించి ఇండైరెక్టుగా చెప్పారు.
ఇకనుంచి తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడినని స్పష్టం చేశారు పీకే. రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకోడానికి పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజల అభివృద్ధి కోసం తన శక్తినంతా ధార పోస్తానని ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రయత్నాన్ని మధ్యలో వదిలేయబోనని బీహార్ ప్రజలకు వాగ్దానం చేస్తున్నటు చెప్పారు.
బీహార్‌లో జన్ సురాజ్ కోసం.. వేల మంది ప్రముఖుల నుంచి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకోనున్నట్లు చెప్పారు. ఇటు కాంగ్రెస్‌పైనా ప్రశాంత్ కిశోర్ మరోసారి కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ కు తన అవసరం లేదని, పార్టీలో సమర్థులైన వ్యక్తులు ఎందరో ఉన్నారని అన్నారు. ఎప్పుడేం చేయాలో వారికే తెలుసని, తనకు కాదని వ్యాఖ్యానించారు.