మాటల గారడీలో కేసీఆర్ ను కొట్టే వారు లేరు. ఏదైనా ఇష్యూని డైవర్ట్ చేయడంలో.. కొత్త వివాదం సృష్టించడంలో ఆయనను మించిన వారు లేరేమో. ఇన్నేళ్ల రాజకీయంలో ఎన్నో డక్కామొక్కీలు తిన్న ఆయనకు రెండు పర్యాయాలు అధికారాన్ని కట్టబెట్టారు ప్రజలు. ముచ్చటగా మూడోసారి నెగ్గాలని కేసీఆర్ ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. కానీ.. ఈసారి తన స్వశక్తిని నమ్ముకోవడం లేదాయన. మరో వ్యక్తిపై భారమంతా మోపి గెలవాలని ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన ఎవరో కాదు.. ప్రశాంత్ కిషోర్.
టీఆర్ఎస్ పార్టీ, పీకే ఐ ప్యాక్ టీమ్ మధ్య సెటిల్ మెంట్ కుదిరినట్లు కనిపిస్తోంది. ఐ ప్యాక్ ప్రతినిధులతో టీఆర్ఎస్ నాయకులు సుదీర్ఘ మంతనాలు జరిపారు. టీఆర్ఎస్ ను జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేసే పనిలో భాగంగా ఈ భేటీ జరిగినట్లు పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. మమతా బెనర్జీ, స్టాలిన్, జగన్ ను కలుపుకుని కేసీఆర్ నాయకత్వంలో ఫెడరల్ ఫ్రంట్ ను ముందుకు తీసుకుపోయే విధంగా పీకే టీం వ్యూహరచన చేస్తోందట. కేసీఆర్ పథకాలు దేశవ్యాప్తంగా అమలే లక్ష్యంగా పీకే పావులు కదుపుతున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే మమతా బెనర్జీకి కేసీఆర్ పై నమ్మకం లేదనేది గత అనుభవాల దృష్ట్యా అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
పీకే టీమ్ తో భేటీ విషయాన్ని తెరపైకి జాతీయ రాజకీయాలు అని కలరింగ్ ఇస్తున్నా.. రాష్ట్ర రాజకీయాల్లోనూ సహకారం తప్పనిసరిగా ఉంటుంది. నిజానికి అదే అసలు ప్లాన్. ఎందుకంటే.. కేసీఆర్ గత రెండు పర్యాయాల గెలుపును ఉద్యమ సెంటిమెంట్ గానే భావిస్తున్నారు విశ్లేషకులు. పైగా రేవంత్ టీపీసీసీ పదవి చేపట్టాక కాంగ్రెస్ దూకుడు మీదుంది. ఈటల చేరిక తర్వాత బీజేపీ కూడా మరింత స్పీడ్ గా పావులు కదుపుతోంది. వీళ్లకి తోడు.. షర్మిల పెట్టిన వైటీపీతో ఓట్లు చీలే ప్రమాదం ఉంది. ఇది టీఆర్ఎస్ తో పాటు అన్ని పార్టీలకు ఇబ్బందే. ఇవన్నీ చాలవన్నట్లు కేసీఆర్ పై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత మరోవైపు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిలోనే ఉన్నారు. ఈ పరిణామాలన్నీ బేరేజు వేసుకుని పీకే సాయంతో గట్టెక్కాలని కేసీఆర్ ప్లాన్ గా కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కానీ.. ఇది వర్కవుట్ అవ్వకుండా బెడిసి కొట్టే ప్రమాదమే ఉందని అంచనా వేస్తున్నారు. పీకేని నమ్ముకుంటే.. కేసీఆర్ పని అయిపోయినట్లే.. ఆయన గ్రాఫ్ తగ్గిపోయినట్లేగా అని విశ్లేషిస్తున్నారు.