ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ కోసమే పనిచేస్తున్నారని జేడీయూ సంచలన ఆరోపణలు చేసింది. పీకే చేపట్టిన పాదయాత్రకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటూ జేడీయూ ప్రశ్నలు సంధించింది. ఈ మేరకు పీకేపై జేడీయూ బిహార్ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
సీఎం నితీశ్ కుమార్ పాలనలో రాష్ట్రం ఎంత అభివృద్ధి జరిగిందనేది ప్రజలందరికీ తెలుసని ఆయన అన్నారు. ఈ విషయంలో తమక పీకే సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పని లేదన్నారు. ఆయన బీజేపీ తరఫున పనిచేస్తున్నట్టుగా కనిపిస్తోందన్నారు. ప్రచారం కోసం ఆయన భారీగా ఖర్చు చేస్తున్న విధానం చూస్తే అనుమానాలకు తావిస్తోందన్నారు.
పెద్ద పెద్ద పార్టీలు సైతం పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు చాలా తక్కువగా ఇస్తున్నాయని, కానీ పీకే మాత్రం తరుచుగా ఫుల్ పేజీ ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఐటీశాఖ, సీబీఐ, ఈడీలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. పీకేకు కేంద్రంలోని పెద్దల మద్దతు ఉండటమే ఇందుకు కారణమని అనిపిస్తోందన్నారు.
కొన్నేళ్ల క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన పీకే జేడీయూ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కానీ చాలా తక్కువ కాలం మాత్రమే ఆ పార్టీలో కొనసాగారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై ఆయన్ని పార్టీ పక్కన పెట్టింది. ఈ క్రమంలో పీకే బిహార్ లో ‘జన్ సురాజ్’ పేరుతో ఒక సామాజిక సంస్థను స్థాపించారు. ఈ సంస్థ తరఫున ఆయన పాదయాత్రలు చేస్తున్నారు.