ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో.. ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో ఆయన సమావేశమవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ ముఖ్యనేతలతో అధినేత్రి సోనియా గాంధీ శనివారం జరిపిన కీలక భేటీలో పీకే పాల్గొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, రెండేళ్ల తరువాత సార్వత్రిక ఎన్నికల్లో పటిష్టమైన వ్యూహరచన కోసం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన చితన్ శిబిర్ లేదా చింతన్ భైఠక్ పై చర్చించారు. అయితే.. ఈ సమావేశంలోనే పీకే చేరికపైన కూడా సోనియా గాంధీ పార్టీ నేతలతో మాట్లాడినట్టు సమాచారం.
తన రాజకీయ భవిష్యత్తుపై మే 2వ తేదీలోగా నిర్ణయం తీసుకుంటానని ఇంతకు ముందు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్.. నేడు కాంగ్రెస్ నేతల కీలక భేటీలో పాల్గొని చర్చించడం దేశ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో పార్టీ ఉన్నత స్థాయి నేతలు రాహుల్ గాంధీ, అంబికా సోనీ, దిగ్విజయ్ సింగ్, మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్, కేసి వేణుగోపాల్ పాల్గొన్నారు. అయితే.. పీకేను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై వీరంతా ముందుగానే చర్చించుకున్నట్టు సమాచారం. ఈనేపథ్యంలోనే పార్టీ ముఖ్యనేతల సమావేశానికి వచ్చిన పీకే.. రాబోయే ఎన్నికలకు సంబంధించి వ్యూహాలపై తన అభిప్రాయాలను వివరించినట్లు తెలుస్తొంది.
ఇదిలా ఉంటే.. 2020లోనే కాంగ్రెస్‌లో చేరాలని ప్రశాంత్ కిషోర్ ముందస్తుగా ప్లాన్ చేసుకున్నప్పటికీ.. అనేక విషయాలపై విభేదాల కారణంగా కుదరలేదు. ఇక.. మార్చిలో ప్రశాంత్ కిషోర్.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలిశారని గతంలో ప్రచారం సాగింది. అయితే.. ఆ భేటీపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ.. పీకే మళ్లీ పార్టీలో చేరుతున్నారనే సందడి మాత్రం ఇప్పుడు కనిపిస్తోంది.
గతంలోనూ పీకే 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ తో కలిసి పనిచేశారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 117 స్థానాలకు గానూ.. 77 స్థానాలను గెలుచుకుంది. ఇక.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పీకే వ్యూహరచనలో బీజేపీ ఘనవిజయం సాధించింది. దీంతో కిశోర్ కు మంచి గుర్తింపు లభించింది. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రానివ్వకూడదన్న లక్ష్యంతో పీకే ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశమైయ్యారని ప్రచారం జరుగుతోంది.