కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీతో పోలిస్తే తాను చాలా చిన్న వాడినని పేర్కొన్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, ప్రశాంత్ కిషోర్ జన సూరజ్ యాత్రలో బిజీగా ఉన్నారు.
ఈ రెండు యాత్రలకు మధ్య ఏవైనా పోలీకలు ఉన్నాయా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధాన మిచ్చారు. రాహుల్ గాంధీ 3,500 కి.మీ సుదీర్ఘమైన యాత్రలో ఉన్నారని ఆయన అన్నారు. తనకు మాత్రం దూరంతో సంబంధం లేదన్నారు.
తాను అక్టోబరు నుంచి ఎలాంటి విరామం తీసుకోలేదన్నారు. యాత్రను నిర్విరామంగా కొనసాగిస్తున్నట్టు చెప్పారు. తాను ఈ యాత్రను తన శారీరక దృఢత్వాన్ని నిరూపించుకునేందుకు చేయడం లేదన్నారు. మధ్యలో ఇంటికి వెళ్లడం లేదని పరోక్షంగా రాహుల్ గాంధీకి చురకలంటించారు.
తాను నూతన సంవత్సరం సందర్భంగా విశ్రాంతి తీసుకోవడం లేదన్నారు. తర్వాతి ప్రదేశాన్ని చేరుకునేందుకు మధ్య మధ్యలో వాహనాలపై ప్రయాణించేందుకు తాను అంగీకరించబోనని పరోక్షంగా రాహుల్ గాంధీని ఆయన ఎద్దేవా చేశారు. తన యాత్ర ఉద్దేశం మాత్రం స్వచ్ఛమైందని తెలిపారు.