ఇటీవల బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితిశ్ కుమార్ తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశం కావడంపై రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. జేడీయూ నుంచి ఉద్వాసనకు గురైన పీకే దాదాపు రెండేండ్ల తర్వాత ఆ పార్టీ అధినేతతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని ఇరువురు చెబుతున్నారు. అయితే వీరి భేటీ వెనక ఇరువురి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని అంతా భావిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక కూటమిలోకి నితీశ్ ను తీసుకు వచ్చే బాధ్యత పీకే తీసుకున్నారని, అందుకే నితీశ్ తో భేటీ అయ్యారని పలు మీడియా చానెల్స్ లో కథనాలు వచ్చాయి.
అయితే అలాంటి అవకాశమే లేదని పీకే సన్నిహితులు ఈ వాదనలను కొట్టి పాడేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీతో జేడీయూ సంబధాలు చాల బలంగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో నితీశ్ ను బయటికి తీసుకురావడం అంత సులువైన పని కాదని చెబుతున్నారు.
సీఏఏ సమయంలో నితీశ్ వ్యవహరించిన తీరుతో ముస్లిం వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని వారు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నితీశ్ ను బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ లోకి తీసుకు రావడం వల్ల పెద్ద ప్రయోజనమేమీ ఉండదని పీకే భావిస్తున్నట్టు వారు అంటున్నారు.
అటు మమతతో సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో జేడీయూ అధినేతతో పీకే కలవడంపైనా పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన మళ్లీ జేడీయూలో చేరతారని కొందరు రాజకీయ పండితులు విశ్లేషణలు చేశారు.
జేడీయూ నుంచి పీకేను బయటికి పంపించడంలో ఆ పార్టీ నేత, కేంద్ర మంత్రి ఆర్పీ సింగ్ కీలక పాత్ర పోషించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన ఇంకా జేడీయూలోనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో పార్టీలోకి వచ్చే అంశంపై పీకే ఇప్పుడే ఆలోచనలు చేయడని రాజకీయ పండితులు చెబుతున్నారు.