ఓవైపు బహుజన రాజ్యాధికార యాత్రలో బిజీగా ఉన్న బీఎస్పీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్.. ఇంకోవైపు ప్రభుత్వంపై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. కేసీఆర్ ఫెయిల్డ్ తెలంగాణ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ప్రశ్నిస్తున్న ఆయన.. తాజాగా రాష్ట్ర అప్పులపై సెటైర్లు వేశారు.
బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ బాకీల తెలంగాణ చేశారని విమర్శించారు ఆర్‌ఎస్ ప్రవీణ్. బహుజన రాజ్యంలో ప్రతి పైసా లెక్క ప్రజలకు చూపిస్తామని.. ఇప్పుడు దోచిన నాయకుల లెక్క తేలుస్తామని హెచ్చరించారు. వారి నుంచి ముక్కు పిండి ఆ డబ్బులు వసూలు చేసి గొప్ప పాఠశాలలు, వైద్యశాలలు నిర్మిస్తామని తెలిపారు.
అప్పుల ఊబిలో రైతుల ఆత్మహత్యలు ఒకవైపు.. అప్పులు తెచ్చి దోపిడీ వర్గాలకు దోచిపెడుతున్న వైనం మరోవైపు అంటూ ప్రశ్నించారు ఆర్‌ఎస్పీ. కట్టిన ప్రాజెక్టులలో ఆదివాసీలకు స్థానం ఎక్కడ? అని నిలదీశారు. అలాగే.. తెచ్చుకున్న తెలంగాణలో తెగించి కొట్లాడిన బహుజనుల వాటా ఎక్కడ?.. అప్పులు, ఆత్మహత్యలు మాకు.. ఆడంబరాలు మీకా? నహీ చలేగా అంటూ మండిపడ్డారు ప్రవీణ్.
అంతకుముందు.. మానవత్వం మరిచిన సర్”కారు” అంటూ ఫ్రంట్ లైన్ వారియర్స్ విషయంలో ప్రశ్నించారు. కరోనా సంక్షోభ టైంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేసినందుకు ప్రభుత్వం ఇచ్చే గిఫ్ట్ ఇదేనా అని మండిపడ్డారు. గచ్చిబౌలి టిమ్స్ లో కాంట్రాక్ట్ డాక్టర్లు, సిబ్బందిని వచ్చే నెల 1 నుంచి రావొద్దని చెప్పారు. దీంతో 800 మంది వరకు రోడ్డున పడనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆర్‌ఎస్ ప్రవీణ్ మండిపడ్డారు.