రెవెన్యూ భవన్ వద్ద వేతన స్లిప్ లను తగలబెట్టారు ఉద్యోగ సంఘాల నేతలు. వేతన స్లిప్ లు, పీఆర్సీ జీవోలను పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో బొప్పరాజు, బండి, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ కొత్త వేతనాలు అశాస్త్రీయంగా ఉన్నాయని చెప్పినా హడావిడిగా ప్రభుత్వం జీతాలు బ్యాంకు ఖాతాల్లో వేసేశారని అన్నారు. గతంలో ఎప్పుడూ ఒకటో తారీఖున వేతనాలు వేసిన దాఖలాలు లేవని అన్నారు.
తొందరలో ప్రభుత్వం చనిపోయిన ఉద్యోగులకు కూడా వేతనాలు చెల్లించేసిందని చెప్పుకొచ్చారు. పీఆర్సీ అశాస్త్రీయంగా ఉందని చెబుతున్నా ప్రభుత్వం వినిపించుకునే పరిస్థితి లో లేదని అన్నారు.
బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రివిజ్డ్ పే స్కెల్ వేసే తొందరలో మనుషులు చేసే పనిని మిషన్లు ద్వారా చేసి తప్పులు మీద తప్పులు ప్రభుత్వం చేస్తోందని అన్నారు. మాట మీద లేని ప్రభుత్వం అంతా రివర్స్ చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన వేతనాలను, పెన్షన్ లను ఎవరూ హర్షించటం లేదని గుర్తించాలన్నారు.
ఛలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ఉద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారని ప్రభుత్వానికి మాట మార్చే, మనసు మార్చుకునే జబ్బు వచ్చిందని అన్నారు. ముందు అనుమతి ఉందని చెప్పి ఇప్పుడు లేదంటున్నారు. ప్రభుత్వం చేసిన గాయం కంటే కరోనా తీవ్రమైందేమి కాదని అన్నారు బొప్పరాజు.
ఇక బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగులు తమ వేతన స్లిప్ లను అగ్గి మంట తో కాదు… కడుపు మంట తో తగుల బెట్టారన్నారు. సీఎఫ్ ఎం ఎస్ అనే ఒక ప్రైవేటు ఏజెన్సీ ఉన్నతాధికారులు రహస్య కోడ్ ను తస్కరించి వేతనాలు వేసిందన్నారు. ఇది ఖచ్చితంగా అధికార దుర్వినియోగం అని దీనిపై కోర్టులో కేసులు వేస్తామన్నారు.