– ట్రెడా ప్రాపర్టీ షోలో తుపాకీ రాముళ్లు!
– ప్రీ లాంచ్ పేరుతో ప్రీ ప్లాన్డ్ చీటింగ్స్
– అనుమతులు లేకుండానే అమ్మకాలు
– తక్కువ రేట్ చూసి టెంప్ట్
-క్రెడాయ్ షోలో సువర్ణ భూమి..
బాగోతం బయటపెట్టిన తొలివెలుగు
– ఆపై తొలివెలుగుకు చిక్కిన సాస్ ఇన్ ఫ్రా.
హైదరాబాద్,తొలివెలుగు:తుపాకీ రాముడి మాటలు ఎలా ఉంటాయో చాలా మందికి తెలిసే ఉంటుంది.మాట్లాడితే కోట్లు, సూట్ల నుంచి కిందకు దిగడు.”మా చచ్చిపోయిన బర్రె,పగిలిపోయిన కుండ నిండా పాలు ఇచ్చేదని..వాటితో బాగా బతికేటోళ్లం” అంటూ చెప్పుకుంటూ పోతుంటాడు.అసలు ఆ బర్రె ఉండేదో లేదో తెలియదు..ఆ కుండను చూసినవాళ్లూ ఉండరు. హైదరాబద్ ట్రెడా ప్రాపర్టీ షోకు వచ్చిన రియల్ ఎస్టేట్ కంపెనీల తీరు కూడా అచ్చం అలాంటి తుపాకీ రాముడి మాటలనే తలపించేలా ఉంది.ప్రీలాంచ్ పేరుతో గాలిలోనే వెంచర్లు వేసి..కూల్గా కస్టమర్లను బోల్తా కొట్టించే పనిచేశారు.వినియోగదారులకు తెలివి లేదనుకుంటారో లేక తమను మించిన అతి తెలివిగలవారు లేరనుకుంటారో తెలియదు కానీ..ఏ మాత్రం భయం,బెరుకూ లేకుండా వారిని బోల్తా కొట్టించడమే పనిగా పెట్టుకున్నారు.
ఏపీలో రియల్ భూం లేకపోవడం,బెంగుళూర్లో ఐదేళ్లకు సరిపోయే భవనాలు ఉండటం,ఇక ముంబైలో రేట్స్ పీక్స్కి వెళ్లిపోవడంతో అందరి దృష్టి హైదరాబాద్ పైనే ఉంది.కరోనా సమయంలో అన్ని రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ దివాళా తీసినా,హైదరాబాద్లో మాత్రం ఎవర్గ్రీన్గా ఉండిపోయింది.మూడు ప్లాట్స్-ఆరు అపార్టుమెంట్స్ అన్నట్టుగా వెలిగిపోతూనే ఉంది.ముఖ్యంగా రాబోయే 5 ఏళ్లకు సరిపోయే ప్రాజెక్టులు నగరంలో లేకపోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వరంగా మారింది.చూద్దామంటే అసలు వెంచర్లే ఉండవు కానీ,కాగితాల్లో మాత్రం సకల సౌకర్యాలతో వెంచర్లను డిజైన్ చేస్తారు.అవసరమైతే పెద్ద పెద్ద భవంతులని కూడా కట్టేస్తారు.ఓ వైపు యజమానులకు రూపాయి కూడా ఇవ్వకుండానే భూములు అగ్రిమెంట్ చేసుకోని..మరోవైపు వినియోగదారుల దగ్గర మాత్రం రూ.లక్షలు దండుకుని ఎంవోయూలు కుదుర్చుకుంటారు.
ఇలాంటి వ్యవహారాలు గతంలో చాలా రహస్యంగా జరిగిపోయేవి. సాఫ్ట్వేర్, కార్పొరేట్ కంపెనీ ఉద్యోగులను టార్గెట్గా చేసుకొని వారిని బోల్తా కొట్టించేవారు. కానీ ఇప్పుడు రాజమార్గంలోనే కస్టమర్లను బురిడీ కొట్టిస్తున్నారు. క్రెడిబుల్ ఉన్న ప్రాపర్టీ షోలో ప్రవేశం పొంది.. అధికారికంగా అడ్డగోలు మోసానికి తెగబడుతున్నారు. కొనుగోలు దారులను ఆకర్షించేందుకు చిన్న చిన్న కంపనీలు ఆత్యాశ చూపిస్తున్నాయి. చిన్న చిన్న కంపెనీలే కాదు.. బడా సంస్థలు కూడా కస్టమర్లకు టోపీ పెట్టేస్తున్నాయి. ట్రెడా ప్రాపర్టీ షోలో ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో… ప్రీ ప్లాన్డ్గా కొన్ని సంస్థలు చేస్తున్న మోసాలు తొలివెలుగు నిఘా కెమెరాకు చిక్కింది. తక్కువ ధర అంటూ.. కస్టమర్లను చాకచక్యంగా మోసం చేస్తున్న తీరు ఎలా ఉండో చూడండి..
ఏయే కంపెనీలు.. ఎలాంటి కంత్రి పనులు?
అపార్ట్మెంట్స్, విల్లాలు, హెచ్ఎండీఏ ప్లాట్స్, ఫామ్ ల్యాండ్స్ అని చెప్పుకుంటూ..ఎలాంటి అనుమతులు లేకుండానే 14 ప్రాజెక్ట్ లను చేపట్టింది ఎన్ స్క్వేర్. తక్కువ ధరకే అపార్ట్మెంట్ అంటూ మోసాలకు దిగింది. ఎన్ స్క్వేర్ హైట్స్ పేరుతో రామేశ్వరం బండ ప్రాంతంలో రూ. 29 లక్షలకే 1100- 1300 అడుగుల అపార్ట్మెంట్ ఇస్తామని చెబుతోంది. విచిత్రమేమిటంటే ఈ ప్రాజెక్ట్ చేపట్టే భూమి ఏ సర్వే నెంబర్లలో ఉందో, అక్కడ మార్కెంటింగ్ చేసే వాళ్లకు కూడా తెలియదు. ఇక హెచ్ఎండీఏ, రేరా అనుమతులు గురించి ఉన్నాయా అని అడగకపోతేనే మంచిది. ఇదే కంపెనీ.. శంకర్ పల్లిలో షూలిన్ సిటీ నేచర్వుడ్ పేరుతో మూడు ఎకరాల్లో రూ. 25 లక్షలకే అపార్ట్మెంట్ ఇస్తున్నామని ప్రచారం చేసుకుంది. వినియోగదారుల దారుల నుంచి డబ్బులు లాగే ప్రయత్నం చేస్తోంది. అక్కడా అంతే.. భూమి ఎక్కడ ఉందో తెలియదు
విల్లాలది అదే దారి
ఎన్ స్క్వేర్ వెస్ట్వుడ్స్, ది అర్బన్ శాంక్చరీ పేరుతో వెలిమల,వెస్ట్ బ్లోసమ్స్ ఇన్సైర్డ్ లివింగ్ పేరుతో రూ. 45 లక్షలకే చేవెళ్లలో 25 ఎకరాల్లో విల్లాలు ఇస్తున్నామని అంటున్నారు. నాదర్గుల్లో ఎస్.ఎన్. టౌన్ విల్లాస్ పేరుతో 5 ఎకరాల ప్రాజెక్ట్ అన్నారు. కొండకల్లో ఎస్.ఎన్. ప్రైమ్-1,2, విల్లాస్ .. పటాన్ చెరువులో ఎస్.ఎన్. టౌన్ షిప్ విల్లాస్ నిర్మిస్తామని చెప్పుతున్నారు. కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ కి రేరా అనుమతులు కాని , హెచ్ఎండీఏ అనుమతులు కాని రాలేదు. అనుమతులు రాకుండానే హెచ్ఎండీఏ ప్లాట్స్ అంటూ అల్లూర్, చేవెళ్లలో ప్లాట్స్ ని అమ్మకానికి పెట్టారు. మరో దారుణం ఏమిటంటే.. ఆల్రెడీ ఫామ్ ల్యాండ్స్ పేరుతో రూల్స్ ఫాలో కావడం లేదని తెలంగాణ ప్రభుత్వం 20 గుంటల లోపు రిజిస్ట్రేషన్స్ ఆపివేసింది. కాని వీరు మాత్రం మొత్తం డబ్బులు చెల్లిస్తే.. మీకు రెండు మూడు గుంటలు రిజిస్ట్రేషన్ చేస్తామని బోల్తా కొట్టిస్తున్నారు. నవాబ్ పేటలో 33 ఎకరాలు, షామీర్ పేట్ తుర్కపల్లిలో 27 ఎకరాలు, అలూర్ లో 14 ఎకరాల్లో వెంచర్స్ వేశామని అంటున్నారు. కానీ ఏఏ సర్వే నెంబర్లలో ఆ భూములు ఉన్నాయో చెప్పడం లేదు. అసలు ఈ కంపనీ పేరు మీద భూమి ఉందో లేదో కూడా తెలియకుండానే.. ఓ కలర్ పుల్ బుక్ లేట్ ప్రింట్ చేసి ట్రేడా ప్రాపర్టీ షోలో ప్రజల ముందు ఉంచారు. వీరు చెప్పే మాటలు నమ్మితే.. నిలువు దోపిడే అనిపించకమానదు
ప్రణీత్ కూడా అంతే కక్కుర్తి
ట్రస్ట్ ఇన్ బిల్ట్ పేరుతో నార్త్ హైదరాబాద్ కుత్బుల్లాపూర్, కూకట్ పల్లిలో ఎన్నో నిర్మాణాలు చేపట్టిన ప్రణీత్ గ్రూప్ సంస్థ కూడా అనుమతులు లేకుండా అమ్మకాలు జరుపుతోంది. జైత్ర పేరుతో ప్రణిత్ కేకేఆర్స్ ప్రణవ్.. హైదర్ నగర్ లో 6 టవర్స్,14 ప్లోర్స్ తో 571 ప్లాట్స్ నిర్మిస్తున్నారు. అయితే ఇంకా రేరా రాలేదు. కాని ట్రేడా లో మాత్రం పీ లాంచ్ ఆఫర్స్ పేరుతో తక్కువ ధరకు కొనుగోలు దారులను అకర్షించే ప్రయత్నం చేస్తోంది. ప్రణీత్ ప్రణవ్ సోలిటైర్ పేరుతో బాచుపల్లి నిర్మాణాలు కూడా ఇంకా పూర్తి అనుమతులు రాలేదు. కాని పనులు ఊపందుకున్నాయి. అమ్మకాలు ప్రారంభించారు.
వర్టెక్స్ వర్మ వారు అంతే!
బౌరంపేటలో బౌగెయిన్ విల్లే పేరుతో 65 విల్లాలు నిర్మిస్తున్నారు. ఇందులో 25 విల్లాలు ప్రీ లాంచ్ పేరుతో రూ. 75 లక్షలకు అమ్మేశారు. 10 రోజుల్లోనే పూర్తి గా చెల్లించాలి. ఇప్పటికి అనుమతులు లేనే లేవు.. ఆ ఆఫర్ కూడా అయిపోయిందని కంపెనీ ప్రతనిధులు చెబుతున్నారు. రెండు సంవత్సరాల్లో విల్లాలు ఇస్తారు. ఇప్పుడు బుక్ చేసుకుంటే రూ. 3 కోట్లు అంటూ పక్కా అంటూ చెబుతున్నారు. .
ఏపీఆర్ ప్రాజెక్టులో అప్ కమింగ్ ప్రాజెక్ట్స్కు ప్రీలాంచ్
ఏపీఆర్ ప్రవీణ్స్ హైనోరా పేరుతో గాగిల్ పూర్ లో, సాగర్ హైవేలో గోల్డెన్ లీప్, బాచ్ పల్లిలో హిల్ సైడ్ పేరుతో కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టారు. వీటికి ఇంకా రేరా అనుమతులు రాలేదు. కాని ప్రీ లాంచ్ ఆఫర్ ఓపెన్ చేసినట్లు ట్రేడాలో ఆ సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ చెప్పుకొచ్చారు.
గ్రీన్ సీటీ ఎస్టేట్స్
గ్రీన్ సీటీ ఎస్టేట్ పేరుతో వచ్చే ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్స్ శంకర్ పల్లి టౌన్కు అతిసమీపంలో రూ. 12 వేలకు గజం భూమి అంటూ నెంబర్స్ సేకరిస్తున్నారు. 10 రోజుల్లో 50శాతం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ పెడుతున్నారు. ప్రాజెక్ట్ ప్రారంభం అయ్యే సరికి ఇదే రేట్ డబల్ అవుతుందని ఆశ చూపిస్తున్నారు. ఇక్కడా అదే తతంగం అనుమతులు ఉండవు కానీ.. వసూళ్లు మాత్రం ఉంటాయి. శుభ గృహలో అయితే ఏకంగా గృహ ప్రవేశమే చేయిస్తున్నారు.
హెచ్ఎండీఏ అనుమతులు లేకుండానే ఎల్పీ నెంబర్స్తో ఓపెన్ ప్లాట్స్ ని అమ్మకానికి పెడుతున్నారు. ఇలా చాలా ఓపెన్ ప్లాట్స్ నిబందనలు పాటించకుండానే.. అప్లికేషన్ నెంబర్స్ తో మార్కెట్లో కి వస్తున్నాయి. అందుబాటు ధరలో సకాలంలో ఇస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాని గాల్లో మేడలు కట్టేసి, ఆపై కాలం గడిపేసి.. ఏళ్ల తరబడి కస్టమర్స్ని తిప్పించుకోవడమే ఇబ్బందికరం. ప్రీ లాంచ్ పేరుతో ఇచ్చే ఆఫర్లు టెంప్టింగ్గా ఉన్నా.. ఒకవేళ మోసపోయిన తర్వాత మాత్రం ఎలాంటి సాయం దొరకదు. పోలీస్ స్టేషన్స్ కి వెళ్లినా.. ఇవి సివిల్ మ్యాటర్ అంటూ దాటవేస్తారు. ఇక కోర్టులో వేసి కొట్లాడే ధైర్యం రాదు. అన్ని అనుమతులు వచ్చాకే అమ్మకాలు జరపాలని నిబంధనలు చెబుతున్నా.. ఎదో రకంగా కొనుగోలు దారుల నుంచి డబ్బులు వసూలు చేసి వారి డబ్బుతోనే ప్రాజెక్ట్ పూర్తి చేసి కోట్లు గడిస్తున్నారు. పోని అలా అయినా అందరూ చేస్తారా అంటే అదీ అనుమానమే. అసలుకే ఎసరు తెచ్చేలా వ్యవహరించే రియల్ ఎస్టేట్ కంపనీలు చాలానే ఉన్నాయి. అందుకే తస్మాత్ జాగ్రత్త అని తొలివెలుగు హెచ్చరిస్తోంది. తక్కువ ధరలో వస్తున్నాయని అత్యాశకు పోతే.. పైసాపైసా కూడబెట్టి సంపాదించినదంతా మయాల మారాఠీల చేతిలోకి చేరుతోంది. ఆపై వారి ఆడించినట్టు ఆడక తప్పని పరిస్థితి ఎదురవుతుంది.