– జులైలో ఏ క్షణమైనా అసెంబ్లీ రద్దు?
– అన్నీ దాచిపెడుతున్న కేసీఆర్?
– ఎమ్మెల్యేలతో ఓపెన్ అయిపోయిన కేటీఆర్
– బీజేపీకి నిఘా వర్గాల సమాచారం!
– గుజరాత్ తో పాటు తెలంగాణలోనూ రెడీ
– కేసీఆర్ ను తిడుతూ ప్రజల్లోకి కాంగ్రెస్
తెలంగాణలో ఎన్నికల డేట్ ఫిక్స్ అయిందా? డిసెంబర్ నెలలో సాధారణ ఎన్నికలు రాబోతున్నాయా? జాతీయ పార్టీ ప్రకటన తర్వాత గుజరాత్ కు పోటీగా తెలంగాణలో గెలవాలని కేసీఆర్ చూస్తున్నారా? దేశానికి తన సత్తా చూపిస్తాననే నినాదంతో ఎన్నికలకు పోనున్నారా? 8 నెలల క్రితమే దీనిపై ఆయన స్కెచ్ గీశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ పరిశీలకుల నుంచి. కొన్నాళ్లుగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలను అంచనా వేస్తున్న విశ్లేషకులు కేసీఆర్ మరోసారి ముందస్తుకు వెళ్తారని గట్టిగా చెబుతున్నారు. దీనికి కొన్ని ఉదాహరణలను కూడా వారు చెబుతున్నారు. కొన్నాళ్ల క్రితం పార్టీలో హడావుడి చేసి ఎమ్మెల్యేలను పల్లె బాట పట్టించారు కేసీఆర్. అధ్యక్షులను నియమించి ఎన్నికల సంకేతాలు ఇచ్చారు. బూత్ లెవల్ క్యాడర్ ని యాక్టివ్ చేయించారు. ఇదే విషయం ఎంఐఎం పార్టీకి చేరడంతో ఆ ఎమ్మెల్యేలు గతంలో కంటే భిన్నంగా బూత్ లెవల్ లో నాయకులను నియమించి.. ఓటర్లను తమ వైపు తిప్పుకుంటున్నారు. అయితే.. దీనిపై ఎప్పుడు మీడియా అడిగినా.. ఎవరన్నారు.. ఎక్కడి ముచ్చట అంటూ దబాయిస్తూ వస్తున్నారు కేసీఆర్.
కేంద్రానికి సెంట్రల్ ఇంటెలిజెన్స్ నివేదిక
నాలుగు రోజుల క్రితం సెంట్రల్ ఇంటెలిజెన్స్ కేంద్రానికి ఓ నివేదక పంపించింది. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమౌతోంది.. జూలైలో ఎప్పుడైనా అసెంబ్లీని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి.. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు.. వివరాలు అందజేసినట్లు సమాచారం. కేసీఆర్ వ్యూహాలను పసిగట్టిన ఇంటెలిజెన్స్ అన్నీ సవివరంగా కేంద్రానికి అందజేసినట్లు తెలుస్తోంది.
గుజరాత్ తో పాటు జరిగితేనే సేఫ్
ఎన్నికలకు ఎప్పుడు వెళ్తే తనకు కలిసి వస్తుందో.. అప్పుడే వెళ్తారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉప ఎన్నికలకు దారులు నేర్పారు. అప్పట్లో సాదారణ ఎన్నికలు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కలిసిరాలేదు. ఇప్పుడు మరోసారి అధికారం రావాలంటే.. మోడీతో ఢీ కొట్టాలనే ప్లాన్ వేశారు. అందుకు ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా.. త్రిముఖ పోటీలో అధికారం చేజిక్కించుకోవాలని ప్లాన్ వేశారు. ఒకవేళ బీజేపీ డిసెంబర్ లో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో మళ్లీ గెలిస్తే.. ఆ ఊపు 2023లో జరిగే 9 రాష్ట్రాల ఎన్నికలపై ఉంటుంది. మధ్యప్రదేశ్ , రాజస్థాన్, కర్నాటక రాష్ట్రాల ఎన్నికలతో వెళ్లాలనుకున్నా.. మోడీతో పోటీపడుతున్నట్లు కనిపించదు. అప్పటికి ఈడీ, సీబీఐ కేసులతో ఇబ్బందులు కావొచ్చని అంచనా వేశారు. రాష్ట్రంలో అధికారం కావాలంటే.. గుజరాత్ తో పాటే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. గుజరాత్ లో బీజేపీ ఓడిపోతే.. దేశం మొత్తం తిరిగేలా ప్లాన్. గెలిస్తే.. 2019 ఎన్నికల ముందు చేసిన హడావుడితో సరిచేసుకోవచ్చని సౌత్ ఇండియాలో నేషనల్ పార్టీ పేరుతో కూటమితో ఎదైనా చేయవచ్చని కేసీఆర్ ప్లాన్ బీ వేసుకున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు పసిగట్టారు. దీంతో.. టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు అన్ని వనరులను సమకూర్చుకుంటోంది. అభ్యర్ధులు కూడా దొరకని ప్రాంతాల్లో ఇతర పార్టీ నేతలకు గాలం వేసి.. పదవులు ఆశ చూపిస్తోందని చెబుతున్నారు.
గెలుపు ఓటములపై పీకే వర్కవుట్
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. టీఆర్ఎస్ కి 75 సీట్లు వస్తాయని రాష్ట్ర ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది. పీకే టీం కూడా ఇంచుమించు అదే ఇచ్చినట్లు సమాచారం. అయితే.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను 40 మందిని మార్చితేనే ఈ సంఖ్యకు చేరుకుంటుందని పీకే మెలికలు పెట్టారు. దీనిపై లిస్ట్ కూడా రెడీ అయింది. 6 నెలల క్రితం ఇచ్చిన నివేదిక మెరుగు పడలేదు. ఎమ్మెల్యేలు గ్రౌండ్ లో తిరుగుతున్నా.. ప్రజల వద్ద విశ్వసనీయతను పెంచుకోవడం లేదు. దీంతో 40 మందిని మార్చాల్సిందేనని ఫిక్స్ అయ్యారు. వారి లిస్ట్ ఎంటో తొలివెలుగు త్వరలోనే మీ ముందుకు తీసుకురాబోతోంది.