రాష్ట్ర స్వంత ఆదాయ వనరుల పెంపులో భాగంగా జిల్లాల్లో ప్లాట్లను వేలం ద్వారా అమ్మే ప్రక్రియ ఊపందుకుంది. ఎనిమిది జిల్లాల పరిధిలో వివిధ పరిమాణాల్లో ఉన్న దాదాపు 1,092 ఓపెన్ ప్లాట్లను వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మహబూబ్ నగర్, నల్లగొండ, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, పెద్దపల్లి, ఆసిఫాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఈ ప్లాట్లకు సంబంధించి శుక్రవారం జిల్లా కలెక్టర్లు ప్రీబిడ్ సమావేశాలను నిర్వహించనున్నారు.
దీనికి సంబంధించి ఆయా జిల్లాల్లో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా జిల్లాల వారీగా ఉన్న ఓపెన్ ప్లాట్ల సంఖ్యను బట్టి వచ్చే మార్చి నెలలో 14 నుంచి 17 వరకు భౌతిక పద్దతిలో వేలం నిర్వహిస్తారు. ఇప్పటికే భూముల విలువను ఆరు నెలల వ్యవధిలో రెండు పర్యాయాలు పెంచారు. దీనిపై లెఫ్ట్ పార్టీలు సైతం విమర్శలు గుప్పించాయి.
కాగా.. ప్రభుత్వ భూములు అనేవి లేకుండాపోతే.. భవిష్యత్తులో మౌలిక వసతుల కల్పన, పరిశ్రమ ఏర్పాటు కష్టతరమవుతుంది. నిరుపయోగంగా ఉన్నాయని అనుకుంటే.. ఆయా భూములను నిరుపేదలకు పంచివ్వడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ.. ఎవరు ఎన్ని విధాలా అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. ప్రభుత్వం తన ప్రయత్నాన్ని విరమించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అయితే.. మరోవైపు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న కోకాపేట, ఖానామెట్ గ్రామాల్లోని 44.94 ఎకరాలు, 14.92 ఎకరాలను అమ్మేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోడానికి హైకోర్టు నిరాకరించింది. భూములు అమ్మడానికి వీల్లేదని బీజేపీ నాయకురాలు విజయశాంతి వేసిన పిల్ ను కొట్టేసింది. భూముల్నిఅమ్మకుండా ఉత్తర్వుల జారీకి యాక్ట్ లో రూల్స్ ఏమీ లేవని చెప్పింది. దానికి సంబంధించి కామారెడ్డిలోని గెలాక్సీ గార్డెన్, కాగజ్ నగర్ లోని వంజిరి రైతు వేదిక, తాండూరు ఆర్డీవో కార్యాలయాల్లో ప్రీబిడ్ సమావేశాలు జరుగనున్నాయి.