విదేశాలకు వెళ్లే భారతీయులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. విదేశాలకు వెళ్లేవారు గడువు కంటే ముందుగానే కరోనా టీకా బూస్టర్ డోస్ వేసుకునేందుకు అనుమతిచ్చింది. వారి ప్రయాణాలకు భారత వ్యాక్సినేషన్ నిబంధనలు అడ్డురాకుండా.. వివిధ దేశాల నిబంధనలకు అనుగుణంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు బూస్టర్ డోసు నింబంధనలు సడలించింది కేంద్రం.
విదేశాలకు వెళ్లే భారతీయులను ఆయా దేశాలు బూస్టర్ డోసు వేసుకుని ఉండాలనే కండీషన్ పెడుతున్నాయి. కానీ, భారత్‌లో బూస్టర్ డోసు కోసం ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. సెకండ్ డోసు వేసుకున్నాక 9 నెలల తర్వాతే బూస్టర్ డోసు లేదా ప్రికాషన్ డోసుకు అర్హతగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో విదేశాలకు వెళ్లేవారికి ఇది అడ్డంకిగా మారింది. ఈ క్రమంలో విదేశాలకు వెళ్లే భారతీయులకు మాత్రం ఈ నిబంధనను కేంద్రం తాజాగా సడలించింది. విదేశాలకు వెళ్లే భారతీయులు వారు వెళ్లే దేశం విధిస్తున్న రూల్స్‌కు లోబడి ముందుగానే అంటే.. తొమ్మిది నెలల కాలం గడవకున్నా బూస్టర్ డోసు వేసుకోవచ్చని ప్రకటించింది.
ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. భారతీయ పౌరులు, విద్యార్థులు వారు వెళ్లదలుచుకున్న దేశాల గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ప్రికాషన్ డోసు తీసుకోవచ్చని తెలిపారు. ఈ కొత్త సదుపాయం త్వరలోనే కొవిన్ పోర్టల్‌లో అందుబాటులోకి వస్తుందని వివరించారు.
ఇందుకోసం ఇటీవలే నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్(ఎన్‌టీఏజీఐ) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులు పంపింది. విదేశాలకు వెళ్లే భారతీయులకు ఆయా దేశాల గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా బూస్టర్ డోసు వేసుకునే వెసులుబాటు ఇవ్వాలని కేంద్రానికి సూచించింది. అలాంటి వారికి రెండో డోసు తర్వాత బూస్టర్ డోసుకు 9 నెలల గ్యాప్ ఉండాలనే నిబంధన సడలించాలని పేర్కొంది.
ఇక జనవరి 10న దేశంలో మూడో డోసు(ప్రికాషన్) పంపిణీ ప్రారంభమైంది. తొలి దశలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు, 60 ఏళ్లు పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు ప్రికాషన్ డోసు అందించారు. అయితే ఏప్రిల్ 10వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు పైబడిన వారు బూస్టర్ డోస్ వేసేందుకు కేంద్రం అనుమతించింది. ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్ల ద్వారా కోవిడ్ బూస్టర్‌ను పంపిణీ చేస్తున్నారు. తొలి రెండు డోసులు ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో.. మూడో డోసుగా కూడా దానినే పొందాలని కేంద్రం స్పష్టం చేసింది.