వరంగల్ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి సైఫ్ వద్ద నుంచి పోలీసులు కొన్ని వివరాలు సేకరించారు. గత కొద్ది రోజులుగా సైఫ్ ప్రీతిని వేధిస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. ఆమెను అవమానించే విధంగా సైఫ్ చేసిన చాట్ ను పోలీసులు గుర్తించారు.
అయితే సైఫ్ మొబైల్ లో ప్రీతి, సైఫ్ ల వాట్సాప్ చాట్ ను డిలీట్ చేశారు. కానీ దానిని పోలీసులు రికవరీ చేసి ఆధారాలు సేకరించారు. ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి గదిని పోలీసులు అడుగడుగున పరిశీలించి కీలక ఆధారాలను సేకరించారు. ఆమె గదిలో దొరికిన మత్తు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్కువ మోతాదులో మత్తు మందు ఉపయోగం గురించి సంబంధించి ప్రీతి గూగుల్ లో వెదికినట్లు పోలీసులు గుర్తించారు.
గత కొంతకాలంగా సైఫ్ ప్రీతిని వేధిస్తున్నట్లు ఆమె తండ్రి పోలీసులకు తెలిపారు. వాట్సాప్ చాట్ తో సైఫ్ అసలు స్వరూపం బయటపడడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సైఫ్ వరంగల్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. సీనియర్ విద్యార్ధి ర్యాగింగ్ వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని, సైఫ్ గతంలో ప్రీతిని వేధించినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే ఈ విషయాన్ని కే ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ తోసిపుచ్చారు.
సీనియర్ విద్యార్థులు ప్రీతిని ఎప్పుడూ ర్యాగింగ్ చేయలేదని.. ఆమె సరిగా పని చేయడం లేదనే హెచ్చరించారని అన్నారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ప్రీతి.. వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతుంది. ఎంజీఎం ఆసుపత్రిలో శిక్షణలో ఉన్న సమయంలో బుధవారం ఉదయం మత్తు ఇంజక్షన్లు తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన ఆసుపత్రి సిబ్బంది వదీయులకు సమాచారం ఇవ్వడంతో అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం వరంగల్ నుంచి హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.