మెడికో ప్రీతి ఘటనతో కుటుంబసభ్యులు ఎంతో బాధలో ఉన్నారు. వారిని పలు పార్టీల నేతలు వెళ్లి పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రీతి సోదరి దీప్తి మీడియాతో మాట్లాడింది. ఎస్టీ అమ్మాయి కాబట్టే ఈ ఘటనను చిన్నచూపు చూస్తున్నారని మండిపడింది. ముందే ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఏసీపీపై కేసు పెట్టాలని.. పలు అనుమానాలను వ్యక్తం చేసింది.
నిమ్స్ లో ప్రీతి ట్రీట్ మెంట్ కు అవసరమైన వసతులు లేవని.. ఈ ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేయాలని డిమాండ్ చేసింది దీప్తి. అలాగే, ప్రస్తుతం జరుగుతున్న ట్రీట్ మెంట్ పై అనుమానాలున్నాయని తెలిపింది. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై దండ తీసుకురావడంపై అభ్యంతరం తెలిపింది. ‘‘మా అక్క చనిపోయింది అని గవర్నర్ అనుకున్నారా?’’ అని మండిపడింది.
వాళ్లు వీళ్లు వస్తున్నారు.. మీడియా ముందు ఏదేదో చెప్పి వెళ్లిపోతున్నారు.. పబ్లిసిటీ చేసుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది దీప్తి. ప్రభుత్వం వెంటనే కమిటీ వేసి మా అక్కకు ఇలా ఎందుకు జరిగిందో నిజానిజాలు తేల్చాలని డిమాండ్ చేసింది. తమకు కావాల్సింది పరామర్శలు కాదని న్యాయం అని తెలిపింది. ఈ సందర్భంగా ప్రీతి బంధువులు.. నిందితుడ్ని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.
అంతకుముందు మంత్రి సత్యవతి రాథోడ్ ప్రీతి కుటుంబసభ్యులను పరామర్శించారు. బాధితురాలు వైద్యానికి సహకరిస్తోందని.. ఊపిరి తీసుకుంటోందని చెప్పారు. ఆమెను కాపాడేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారని.. కళ్లు తెరిచి చూస్తోందని తెలిపారు. త్వరలోనే మామూలు మనిషిగా కోలుకోవాలని కోరుతున్నానన్నారు. ఈ ఘటన దురదృష్టకరమన్న ఆమె.. పోలీస్ వ్యవస్థ పటిష్టంగానే ఉందని చెప్పారు. తమ ప్రభుత్వంలో ఏ కేసులో అయినాసరే.. నిందితుడు ఎవరైనా తప్పకుండా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు మంత్రి.