తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ కు అనుమతించమనే నిబంధనతో విద్యార్థులు ఉరుకులు పరుగుల మీద పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఓ 9 నెలల గర్భిణీ కూడా పరీక్షకు హాజరైంది.
క్వశ్చన్ పేపర్ తీసుకొని పరీక్ష రాస్తుండగా అనుకోకుండా ఆమెకు పురిటి నొప్పులు రావడం మొదలయ్యాయి. అప్రమత్తమైన కాలేజీ సిబ్బంది.. ఆమెను 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది.
పార్వతీపురం పట్టణానికి చెందిన దేవి అనే మహిళ గతంలో ఇంటర్ బైపీసీ పూర్తి చేసి.. ఆ తర్వాత వెటర్నరీ శిక్షణ పొందింది. అనంతరం ఆమెకు వివాహం అయింది. వివాహం అయినా కూడా దేవి చదువును కొనసాగించింది. ఈ తరుణంలోనే ఆమె గర్భవతి కాగా 9వ నెల వచ్చింది. అయినా కూడా ఆమె పరీక్ష రాసేందుకు భర్తతో కలిసి సెంటర్ కు వచ్చింది.
ఎగ్జామ్ రాస్తుండగా కడుపులో నొప్పి రావడంతో గమనించిన సిబ్బంది.. 108కి సమాచారం అందించారు. అనంతరం ఆమె జిల్లా ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆమె పురిటి నొప్పులు మొదలైనట్టు వైద్యులు చెప్పారు. దీంతో దేవి ఆస్పత్రిలో జాయిన్ కావాల్సి వచ్చింది. దేవికి వైద్య పరీక్షలు నిర్వహించే సమయంలో మహిళా పోలీసు, వైద్య సిబ్బంది ఉన్నారు.