ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఒక్కో నగరాన్ని ఆక్రమించుకుంటూ ముందుకు వెళ్తుండగా.. సామాన్యులు సైతం మరణిస్తున్నారు. అయితే.. ఓ నిండు గర్భిణీని స్ట్రెచర్ పై తీసుకెళ్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. మరియుపోల్ లోని ఓ ప్రసూతి ఆస్పత్రిపై రష్యా బాంబుదాడికి పాల్పడింది. ఈ ఘటనలో గర్భిణీ తీవ్రంగా గాయపడింది. బాధితురాలు ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన సమయంలోనే దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఉక్రెయిన్ సైనికులు ఇంకో ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆపరేషన్ చేసి బిడ్డను బయటను తీశారు.
బాంబు దాడిని దగ్గర నుంచి చూసిన గర్భిణీ షాక్ కు గురైంది. తీవ్ర ఆందోళన పడింది. అదే సమయంలో బిడ్డ చనిపోయి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. అయితే.. తన బిడ్డ చనిపోయిందని తెలిసి ఆ మహిళ తనను కూడా చంపేయాలని కేకలు వేసినట్లు చెప్పారు. దురదృష్టవశాత్తూ కాసేపటికే ఆమె కూడా మరణించిందని వివరించారు.
గర్భిణీ మృతికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తూ రష్యాపై మండిపడుతున్నారు. ఇంకెంతమంది అమాయకులను బలి తీసుకుంటారని కామెంట్స్ పెడుతున్నారు.