కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు భారత్ లో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ కారణంగా ఊరుకాని ఊరులో ఓ యువజంట పాట్లకు చిక్కుకుంది. పనికోసం ఊరు వెళితే లాక్‌డౌన్‌తో ఉపాధి లేకుండా పోయింది. తినేందుకు తిండిలేని పరిస్థితుల్లో ఎలాగైనా ఊరికి వెళ్లిపోవాలనుకుంది ఆ జంట. కానీ ఆమె నిండు గర్భిణి. . అయినా తెగించి వంద కిలోమీటర్లు నడిచింది. చివరికి దారి మధ్యలో పోలీసులు వారి పరిస్థితి చూసి జాలిపడి ఇంటికి చేర్చడంతో కథ సుఖాంతమయింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ లోని షహాన్పూర్‌లోని కర్మాగారంలో వకీల్ పనిచేస్తున్నాడు. అక్కడికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నఅమర్‌గఢ్ వీరి స్వగ్రామం. ప్రస్తుతం వకీల్ భార్య గర్భవతి, లాక్‌డౌన్ కారణంగా కర్మాగారం మూతపడింది. ఊరెల్దామంటే ప్రయాణ సౌకర్యం లేదు. చేతిలో ఉన్న కాస్త డబ్బు కూడా అయిపోతే సమస్యేనని భావించి సొంతూరు వెళ్లిపోవాలనుకున్నారు. దీంతో ఆ దంపతులు కాలికి పనిచెప్పారు.
కానీ జాతీయ రహదారి వెంట ఉన్న భోజన శాలలన్నీ మూతపడడంతో తిండిలేని పరిస్థితుల్లో గర్భిణి అయిన ఆ యువతి తీవ్ర అస్వస్థతకు లోనైంది. శనివారం నాటికి మీరట్ లోని షాహాబ్ గేట్ బస్టాండ్ వద్దకు చేరుకునే సరికి వీరి పరిస్థితిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మానవతా దృక్పథంతో స్పందించిన పోలీసులు స్థానికుల సాయంతో కొంత డబ్బు, అంబులెన్స్ ఏర్పాటు చేసి వారి సొంతూరికి చేర్చారు.