నిండు గర్భిణి అని కూడా చూడకుండా చీటికిమాటికి భర్త గొడవ పడేవాడు. నిత్యం తాగొచ్చి వేధింపులకు గురిచేసేవాడు. రోజురోజుకు భర్త తీరుతో విసిగిపోయిన గర్భిణి దిక్కుతోచని స్థితిలో పుట్టింటి బాట పట్టింది. అయితే, ఆమె చేతిలో రూపాయి లేకున్నా రెండు రోజులపాటు రాత్రనక, పగలనక 65 కిలో మీటర్లు నడిచింది. చివరకు రోడ్డుపై ప్రసవించింది. ఈ ఘటన మన పక్క రాష్ట్రమైన ఏపీలో చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్లితే.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వైఎస్సార్ నగర్ కు చెందిన కొత్తూరు వర్షిణి భర్తతో కలిసి పొట్టకూటి కోసం తిరుపతికి వెళ్లింది. అయితే, అక్కడ నిత్యం భర్త మద్యం సేవించి వేధిస్తుండటంతో వర్షిణి తట్టుకోలేకపోయింది. నిండు గర్భిణి అని కూడా చూడకుండా గొడవపడుతుండటంతో.. భర్త ప్రవర్తనపై విసిగొచ్చి వర్షిణి ఇంట్లోంచి బయటకు వచ్చేసింది.
చేతిలో రూపాయి లేకున్నా తిరుపతి నుంచి అమ్మగారి ఊరైన తునికి కాలినడకన బయలుదేరింది. రెండు రోజులపాటు పగలురాత్రి నడుస్తూ.. 65 కిలోమీటర్లు నడిచిన ఆమె శుక్రవారం అర్ధరాత్రి నెల్లూరు జిల్లా నాయుడుపేట చేరుకుంది. ఈ క్రమంలో బస్టాండ్ వద్ద కళ్ళు తిరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే స్థానికులు 108కి ఫోన్ చేసి సమచారం అందించారు.
దీంతో సిబ్బంది ఆమెను వాహనంలోకి చేర్చి ప్రాథమిక చికిత్స అందించి సురక్షితంగా డెలివరీ చేశారు. 9 నెలలు నిండక పోవడంతో బిడ్డ పరిస్థితి బాగాలేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ సఖి కేంద్రం సిబ్బంది సహకరించి ఆసుపత్రిలో చేర్చారు. తన భర్త వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని వర్షిణి తెలిపారు. అదృష్టం బావుండి ప్రస్తుతం తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు.