తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రా రెడ్డి అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో యువ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీని అక్రమంగా ముందస్తు అరెస్ట్ చేసారు పోలీసులు.
ఈ సందర్భంగా శివాజి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మంత్రి పర్యటిస్తే విద్యార్థులు అరెస్ట్ కావాలా అని ప్రశ్నించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని కలిసే హక్కు విద్యార్థులకు లేదా అని నిలదీశారు. నల్లమలలో విద్యార్థుల గోస మంత్రికి పట్టదా..? అన్నారు.
విద్యారంగంలో ఉన్న సమస్యల గురించి మంత్రికి వినతి పత్రం అందజేయాలని అనుకున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసు శాఖ పూర్తిగా టీఆర్ఎస్ కోసం పనిచేస్తోందన్నారు శివాజీ.
బంగారు తెలంగాణ సాధిస్తాం అని మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. మరోవైపు ప్రజలను బందీలుగా చేసి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. సమస్యలు పరిష్కరించే సత్తా లేక ప్రశ్నించిన వాళ్లపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు శివాజి.