ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులను ముందస్తు అరెస్టులు చేశారు పోలీసులు. జిల్లాలోని ఐనవోలు, జాఫర్ఘడ్, ధర్మసాగర్ మండలాల్లో అర్ధరాత్రి నుండే రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.
ల్యాండ్ పూలింగ్ జీఓ 80ఏ ను శాశ్వతంగా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. బుధవారం జాతీయ రహదారి దిగ్బందానికి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో వివిధ ప్రాంతాల నుండి రైతులు భారీగా తరలి వెళ్లే అవకాశం ఉందని గమనించిన పోలీసులు రైతులను ముందస్తు అరెస్టులు చేసి స్థానిక పోలీసు స్టేషన్ కు తరలించారు.
రైతుల నిరసనను భగ్నం చేయడానికే ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులపై విరుచుకుపడ్డారు రైతులు. నిర్భందాలతో రైతు ఉద్యమాలను ఆపలేరని రైతు ఐక్య కార్యాచరణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ బుద్దె పెద్దన్న హెచ్చరించారు.
ప్రజాస్వామ్య దేశంలో రైతులకు రాజ్యాంగ బద్దంగా నిరసన తెలియజేసే లేకుండా చేశారని ఆరోపించారు. శాంతియుత నిరసనలకు సిద్ధమవుతున్న రైతులను అడ్డుకోవడం దుర్మార్గమని విమర్శించారు. పోలీసులు అత్యుత్సాహాన్ని చూపిస్తూ రైతులపై జులుం చేస్తున్నారని ఆరోపించారు పెద్దన్న.