చరిత్ర సృష్టి జరుగుతున్నప్పుడు ఎవరూ గుర్తించలేరు. అది చరిత్రగా నిలిచిపోయిన తర్వాత ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరం లేదు. సరిగ్గా పాతికేళ్ల కిందటొచ్చిన ప్రేమించుకుందాం రా సినిమాకు ఇది అతికినట్టు సరిపోతుంది. 1997, మే 9న రిలీజైన ఈ సినిమా టాలీవుడ్ లో చరిత్ర సృష్టించింది. ఫ్యాక్షన్ కథకు లవ్ స్టోరీ యాడ్ చేసి తీసిన ఈ సినిమా ఆ తర్వాత ఎన్నో సినిమాలకు స్ఫూర్తిగా నిలిచింది.
పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కల్ట్ బ్లాక్ బస్టర్ పై దర్శకుడు జయంత్ సి.పరాన్జీ స్పందించాడు. ప్రేమించుకుందాం రా తొలి రోజు అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇప్పటికీ అది తన కళ్లముందు కదులుతోందంటున్నాడు ఈ దర్శకుడు.
“మొదటి రీల్ పూజ కోసం నిర్మాత సురేష్ బాబు తో కలిసి తిరుపతి వెళ్ళాను. దేవుడు అంటే నాకు నమ్మకం లేకపోయినా సురేష్ బాబు బలవంతం మేరకూ తిరుపతి వెళ్ళాను. సురేష్ బాబు బాగా టెన్షన్ పడుతూ ఆ రాత్రి సరిగ్గా పడుకోలేదు. నేను మాత్రం హ్యాపీగా నిద్రపోయాను. అక్కడి నుండి నేరుగా విజయవాడ వెళ్లాం. మెయిన్ థియేటర్ లో మొదటి షో చూస్తున్నాం. ఎవ్వరు ఎంజాయ్ చేయట్లేదు. కనీసం కామెడీ సన్నివేశాలకు కూడా నవ్వట్లేదు. నాకు అప్పుడు భయం స్టార్టయింది. అంతకుముందే రామానాయుడు గారు నాటిన అనుమానం నాకు ఉంది. ‘ఈ కామెడీ కి జనం నవ్వుతారా ?’ అనేది రామానాయుడు డౌట్. దీంతో నాకు టెన్షన్ రెట్టింపు అయింది. ఆ టెన్షన్ లోనే ఇంటర్వెల్ అయ్యింది. జనాల రెస్పాన్స్ మాత్రం ఏం లేదు. సినిమా ఫ్లాప్, ఆడటం కష్టమే అనుకున్నాను. కానీ ఎందుకో ఆ టైమ్ లో సురేష్ బాబు మాత్రం కూల్ గా ఉన్నాడు. నైట్ అంతా టెన్షన్ పడిన సురేష్ బాబు, అంత కూల్ గా ఉండడం ఆశ్చర్యం వేసింది. ఇద్దరం మళ్ళీ థియేటర్ లోపలకెళ్లి కూర్చున్నాం. సెకండాఫ్ మొదలైంది. ఇక అక్కడ్నుండి ఆడియన్స్ రియాక్షన్ మొదలైంది. నాకు కొండంత బలమొచ్చింది. క్లైమాక్స్ లో విజిల్స్ వేస్తూ హంగామా చేస్తున్న ప్రేక్షకులను, వెంకటేష్ ఫ్యాన్స్ ని చూస్తూ మురిసిపోయాను.”
ఇలా తన తొలి రోజు అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు జయంత్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. 175 రోజుల పాటు ఏకథాటిగా ఆడింది. నటి అంజలా ఝవేరీకి స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. మణిశర్మ మేజిక్ ను మరోసారి అందరికీ రుచిచూపించింది. వీఎన్ ఆదిత్య, కాశీ విశ్వనాధ్, చంద్రమహేష్ లాంటి దర్శకులు, అప్పట్లో ఈ సినిమాకు డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేశారు.