ఢిల్లీలో నిర్భయ దోషులను ఈ నెల 22న ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలో డమ్మీ ఉరి నిర్వహించనున్నట్టు తీహార్ జైలు అధికారులు తెలిపారు. దోషులు పవన్ గుప్తా, అక్షయ్, వినయ్ శర్మ, ముఖేష్ సింగ్ లను ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. డెత్ వారెంట్ కూడా జారీ చేసింది. నలుగురిని ఒకేసారి ఉరి తీయడం దేశంలో ఇదే మొదటి సారి కావడంతో పొడవైన ఉరితాడును సిద్ధం చేస్తున్నారు. డమ్మీ ఉరి తీహార్ జైలు నెం-3 లో జరగనుంది. ఈ డమ్మీ ఉరి కార్యక్రమంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్, జైలు సూపరింటెండెంట్ ఇతర అధికారులు పాల్గొంటారు.
ఇదే జైలు నెం-3 లో గతంలో పార్లమెంట్ పై దాడి చేసిన అప్జల్ గురును 2013 లో ఉరి తీశారు. ఉరి తీసే తలారిని ఉత్తరప్రదేశ్ నుంచి పిలిపించారు. ఉరి తీసేంత వరకు ఆ నలుగురు దోషులను వేర్వేరు గదుల్లో ఉంచుతారు. చివరి సారిగా కుటుంబసభ్యులను కలవడానికి అనుమతిస్తారు.