మహారాష్ట్రలో కరోనా వైరస్ కట్టడి పూర్తిగా నియంత్రణ తప్పిపోయింది. రోజులు గడిచేకొద్ది భారీగా కేసులు పెరిగిపోతున్నాయి. కొత్తగా అక్కడ రికార్డుస్థాయిలో 40,414 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. మరో 108 ప్రాణాలు కోల్పోయారు. ఫలితం.. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27.13లక్షలకు చేరింది. ఇక మరణాల సంఖ్య 54,181కు పెరిగింది. ఇందులో ముంబైలోనే రికార్డుస్థాయిలో 6,923 కరోనా కేసులు వెలుగుచూశాయి. ముంబైలో ఇప్పటిదాకా సుమారు 4 లక్షల మంది కరోనా వైరస్ బారినపడ్డారు.
కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో.. ఇక సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇందుకు సంబంధించిన సంకేతాలిచ్చారు. సంపూర్ణ లాక్‌డౌన్ విధించేందుకు విధివిధానాలు రూపొందించాలని నిన్న అధికారులను ఆదేశించారు. నిత్యావసరాలు, అత్యవసర పనులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థపై తక్కువ ప్రభావం పడేలా రూట్ మ్యాప్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ముందు నుంచి హెచ్చరిస్తున్నట్టే.. ఏప్రిల్ 2 నుంచి అక్కడ లాక్‌డౌన్ తప్పేలా లేదు.
ఇప్పటికే మహారాష్ట్రలో నిన్నటి (ఆదివారం) నుంచి రాత్రి పూట కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు విధిస్తున్నారు. రాత్రి కూడా మహారాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, బహిరంగ ప్రదేశాలు నిర్మానుష్యంగా మారాయి.