‘మాస్టర్ ప్లాన్’ అమలుకు వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో మూడో రోజు నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ‘మాస్టర్ ప్లాన్’ రద్దు చేయకపోతే.. రాజీనామాలకు సిద్ధమంటూ ఆయా గ్రామాల సర్పంచులు ప్రకటించారు. ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్ అమలవుతున్న గ్రామ ప్రజలు జేఏసీగా ఏర్పడి ఉద్యమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
జగిత్యాల పట్టణ మున్సిపల్ పరిధిలో మాస్టర్ ప్లాన్ అమలవుతున్న నేపథ్యంలో మోతే, తిమ్మాపూర్, నర్సింగాపూర్, దరూర్ గ్రామాల రైతులు ప్రజల పెద్ద ఎత్తున తరలి వచ్చి బల్దియా కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం మున్సిపల్ కార్యాలయం నుండి తహసీల్ చౌరస్తా వద్ద భారీ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు నచ్చజెప్పి ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు వినకపోవడంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ముదిగంటి రవీందర్ రెడ్డి నియోజకవర్గ నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి రైతుల నిరసనకు మద్దతు తెలిపారు.
రీక్రియేషన్ జోన్ నుండి పట్టా భూములకు సంబంధించిన సర్వే నెంబర్లను తొలగించామని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సంబంధిత గ్రామాల రైతులందరినీ ఏకం చేసి జేఏసీగా ఏర్పడి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు గ్రామాల రైతులు.