దేశంలో కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బుధవారం కరోనా ఎక్స్ఈ తొలి కేసు నమోదైనట్టు వార్తలు వచ్చాయి. దీంతో అందరూ ఒక్క సారిగా ఆందోళనకు గురయ్యారు.
దీనిపై కేంద్ర వైద్యారోగ్య శాఖ స్పందించింది. దేశంలో కరోనా ఎక్స్ ఈ వేరియంట్ తొలి కేసు నమోదైనట్టు వస్తున్న వార్తలను ఖండించింది. దేశంలో కొత్త వేరియంట్ ఉనికిని ప్రస్తుత ఆధారాలు సూచించడంలేదని తెలిపింది.
ఎక్స్ ఈ వేరియంట్ అని పేర్కొంటున్న శాంపిల్ కు సంబంధించి ఫాస్ట్ క్యూ ఫైల్స్ ను ఇన్సాకాగ్ నిపుణులు వివరంగా విశ్లేషించారని ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వేరియంట్ యొక్క జీనోమిక్ కానిస్ట్యూషన్ ఎక్స్ఈ వేరియంట్ జన్యు చిత్రంతో సంబంధం లేకుండా ఉన్నట్టు తేలిందని వైద్య శాఖ వెల్లడించింది.
వైరస్ బారినపడినట్టుగా చెబుతున్న 50 ఏండ్ల మహిళలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని తెలిపింది. ఆమె రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నట్టు కేంద్రం చెప్పింది.