పాకిస్తాన్ అధ్యక్షుడు అరీఫ్ అల్వీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ అసెంబ్లీ( పార్లమెంట్)ను రద్దు చేస్తున్నట్టు ఆయన ఆదివారం ప్రకటించారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లేఖ రాసిన కొద్ది నిమిషాల్లోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
పార్లమెంట్ రద్దు నేపథ్యంలో 90 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. అప్పటి వరకు ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ కొనసాగుతారని, అయితే పార్లమెంట్ ను మాత్రం రద్దు చేస్తు్న్నట్టు తెలిపారు.
ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాసం తీర్మానం నేపథ్యంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పంజాబ్ గవర్నర్ సర్వర్ ను పదవి నుంచి తొలిగిస్తున్నట్టు ఇమ్రాన్ ప్రభుత్వం వెల్లడించింది.
మరి కొద్ది సేపటికే పార్లమెంట్ స్పీకర్ పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. తీర్మానంపై ఓటింగ్ విషయంలో ఆయన వ్యవహరతీరు సరిగా లేదని, స్పీకర్ రాజ్యాంగం ప్రకారం వ్యవహరించండం లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ఆ తర్వాత కొద్ది సేపటికే తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. తీర్మానం రాజ్యంగంలోని ఆర్టికల్ 5కు వ్యతిరేకంగా ఉందని చెబుతూ తిరస్కరించారు. అనంతరం కొద్ది క్షణాల్లోని దేశాధ్యక్షుడికి ఇమ్రాన్ లేఖ రాశారు. పార్లమెంట్ ను రద్దు చేయాలని లేఖలో కోరారు.