రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 28వ తేదీన తెలంగాణకి వస్తున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రాష్ట్రానికి రానున్నారు. దీంతో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వద్ద సందడి వాతావరణం మొదలైంది. ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ఖరారైన విషయం తెలిసిందే. ఆమె బస చేసే నేపథ్యంలో రాష్ట్రపతి నిలయ పరిసరాలను, భవనాలను ముస్తాబు చేస్తున్నారు.
రాష్ట్రపతి హైదరాబాద్ రాక సందర్భంగా ప్రభుత్వం ఆమేరకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రపతి నిలయంలో మరమ్మతు పనులు చేపట్టారు. జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ బోర్డుల పర్యవేక్షణలో రాజీవ్ రహదారి నుంచి హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వరకు రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షణలో హోం, రోడ్లు, భవనాలు, జీహెచ్ఎంసీ, జలమండలి, అటవీ, మార్కెట్, విద్యుత్తు తదితర 25 శాఖల సిబ్బందితో పాటు కంటోన్మెంట్ బోర్డు, రక్షణ శాఖ అధికారులు ఏర్పాట్లలో ఉన్నారు.
కాగా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బొల్లారం నిలయానికి రావడం ఇది తొలిసారి. సాధారణంగా వర్షాకాలం, శీతాకాలం విడిది కోసం ఇక్కడికి రావడం ఆనవాయితీ. కొన్ని కారణాల వల్ల దశాబ్దంన్నర నుంచి రాష్ట్రపతులు శీతాకాల విడిది మాత్రమే నిర్వహిస్తున్నారు. మధ్యలో ప్రణబ్ ముఖర్జీ ఒకసారి వర్షాకాల విడిది చేశారు. తాజాగా ద్రౌపది ముర్ముకు తొలి పర్యటన కావడంతో ప్రత్యేకత కనిపించేలా యంత్రాంగం కసరత్తులు చేస్తోంది.