రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు రామప్పలో పర్యటించారు. ఆలయంలో అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. రుద్రేశ్వరుడికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమెకు వేదపండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలనుు అందించారు.
రాష్ట్రపతికి, గర్నవర్ తమిళిసైకి మేడారం సమ్మక్క సారలమ్మ చీరను ఆదివాసీ పూజారులు అందజేశారు. ఆలయ నిర్మాణం, విశిష్టత, యునెస్కో గుర్తింపునకు తయారు చేసిన డోసియర్ వివరాలు, వరల్డ్ హెరిటేజ్ సంస్థ విధించిన నిబంధనలు, తదితర అంశాలను రాష్ట్రపతికి కాకతీయ హెరిటేజ్ ట్రస్టు కన్వీనర్ పాండురంగారావు వివరించారు.
ఈ సందర్భంగా కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు చేయగా రాష్ట్రపతి తిలకించారు. భద్రాచలం నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆలయానికి వచ్చారు. అక్కడి నుంచి బ్యాటరీ కారులో రామప్పకు చేరుకున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో రామప్ప ఆలయాన్ని ఎన్ఎస్‌జీ అధికారులు పూర్తిగా వారి ఆధీనంలోకి తీసుకున్నారు.
కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రసాద్ పథకంలో భాగంగా రామప్ప చుట్టుపక్కల కల్పించునున్న మౌలిక సదుపాయాలకు సంబంధించిన, కామేశ్వరాలయ పునర్ నిర్మాణ శిలాఫలకాలను రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం‘ప్రసాద్’ పథకంలో భాగం గా రూ.61.99 కోట్లను కేంద్రప్రభుత్వం మంజూరు చేసింది.
అంతకుముందు భద్రాద్రిలో రామయ్యను రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు. ఆలయం వద్ద రాష్ట్రపతికి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో శ్రీసీతారామచంద్ర స్వామివారికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు.