పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జీ రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి రాసిన లేఖపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ చీఫ్ సెక్రటరీ, రాష్ట్రపతి ప్రైవేట్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. అయితే తన లేఖపై స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రజ్ఞారెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
కాగా 2014లో జీ రాఘవరెడ్డి కుమారుడు ఏక్ నాథ్ రెడ్డితో ప్రజ్ఞారెడ్డి వివాహం జరిగింది. అయితే వీరి కాపురంలో కలతలు రావడంతో ప్రజ్ఞారెడ్డి గతంలో పుల్లారెడ్డి కుటుంబ సభ్యులపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ప్రజ్ఞారెడ్డి తన గదిలో ఉండగానే, బయటికి రాకుండా రాత్రికి రాత్రే గోడ నిర్మించడం సంచలనంగా మారింది.
అయితే ఇప్పుడు హైదరాబాద్ కి రాష్ట్రపతి రాకతో ప్రజ్ఞారెడ్డి లేఖ రాయడం సంచలనంగా మారింది. తన మామ జీ రాఘవరెడ్డి, అత్త భారతి రెడ్డి, వారి కుమార్తె శ్రీదివ్య రెడ్డి తనను, తన 8 ఏళ్ల కుమార్తెను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారంటూ ప్రజ్ఞారెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.
వారి నుంచి తనను కాపాడాలంటూ ఆమె రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. వరకట్నం కోసం తనను హింసిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని ప్రజ్ఞారెడ్డి పేర్కొన్నారు.