హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం షేక్ పేటలోని జీ నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మహిళా కళాశాల సందర్శించారు. అనంతరం ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ తో సమావేశమయ్యారు. నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ కు రాష్ట్రపతితో పాటు గవర్నర్ తమిళి సై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ.. నారాయణమ్మ కాలేజీలో మీ అందరితో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు.
టెక్నాలజీ అనేది అన్ని రంగాల్లో కీలకమైందన్నారు. ప్రపంచాన్ని బెటర్ ప్లేస్ గా మార్చే శక్తి మనకుందన్నారు. చాలా మంది మహిళలు పెద్ద కంపెనీలను నడిపిస్తున్నారన్నారు. టెలికాం, డిజైన్, ఏవియేషన్, ఐటీ వంటి రంగాల్లో మహిళలు ప్రతిభ చూపుతున్నారని పేర్కొన్నారు. దేశంలో స్త్రీ, పురుష్ అనే రెండు వర్గాలు మాత్రమే ఉన్నాయన్నారు. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ మనందరి లక్ష్యమన్నారు. చదువుతో పాటు సంస్కారం కూడా అలవర్చుకోవాలన్నారు.
కాగా గురువారం సాయంత్రం రాష్ట్రపతి శంషాబాద్ లోని శ్రీరామ్ నగర్ లో సమైక్యతామూర్తి శ్రీ రామానుజాచార్య విగ్రహాన్ని సందర్శించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు శంషాబాద్ లో పూర్తి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
అనంతరం శుక్రవారం ఉదయం రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతి వనంలో శ్రీ రామచంద్ర మిషన్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అంగన్వాడీ, ఆశా వర్కర్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ‘హర్ దిల్ ధ్యాన్, హర్ దిన్ ధ్యాన్’ ప్రచార కార్యక్రమం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1.00 గంటలకు బొల్లరంలోని రాష్ట్రపతి నిలయంలో.. రాష్ట్రపతి విందు ఇవ్వనున్నారు.