రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకోనున్నారు. ఈ నెల 29న ఆమె యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకోనున్నారు. ఈ క్రమంలో తగిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
ఇప్పటి వరకు యాదాద్రిని నలుగురు రాష్ట్రపతులు సందర్శించారు. తాజాగా ఈ క్షేత్రానికి వచ్చిన ఐదో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలవనున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా సకల సౌకర్యాలను కల్పించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.
రాష్ట్రపతి రాకతో యాదాద్రి పుణ్యక్షేత్రం విశిష్టత, ఖ్యాతి దేశ నలుదిశలా వ్యాప్తి చెందుతుందని యాదాద్రి దేవాలయాభివృద్ది వైస్ ఛైర్మన్ కిషన్‌రావు వెల్లడించారు. ఈ ఆలయాన్ని దర్శించుకున్న మొదటి రాష్ట్రపతిగా స్వర్గీయ డా.రాజేంద్రప్రసాద్ నిలిచారు.
ఆ తర్వాత డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డా.శంకర్ దయాల్ శర్మ, ప్రణబ్ ముఖర్జీలు ఈ క్షేత్రాన్ని సందర్శించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ క్షేత్రాభివృద్ధి పనులకు ముందస్తుగా 2015 జులై 5న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విస్తరణకు పూర్వం నాటి పంచనారసింహుల ఆలయాన్ని సందర్శించి దైవదర్శనం చేసుకున్నారు.