ముచ్చింతల్ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందన్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. 120 కిలోల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. 216 అడుగుల ఎత్తయిన సమతా మూర్తి విగ్రహాన్ని దర్శించుకుని ప్రసంగించారు.
సర్వమానవ సమానత్వాన్ని రామానుజాచార్యులు ఆచరించమని చెప్పారని గుర్తు చేశారు రాష్ట్రపతి. మానవజీవన విధానంలో విశిష్టాద్వైతం అంతర్భాగమని.. గోదావరి నది ఆశీర్వాదంతో సమతామూర్తిని అద్భుత క్షేత్రంగా నెలకొల్పారని కొనియాడారు.
భక్తితో ముక్తి లభిస్తుందని రామానుజులు చెప్పారని.. సాంస్కృతిక విలువల ఆధారంగా దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చారని అన్నారు రామ్ నాథ్. దేశంలో భక్తి మార్గం దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లిందని అక్కడి సాధువులు రామానుజుల సిద్ధాంతాలతో ప్రభావితమయ్యారని తెలిపారు.
మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి దంపతులు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్ సహా పలువురు స్వాగతం పలికారు. తర్వాత హెలికాప్టర్ లో ముచ్చింతల్ ఆశ్రమానికి వెళ్లారు రాష్ట్రపతి. ఆయన వెంట ప్రభుత్వం తరఫున తలసాని శ్రీనివాస్ ఉన్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.