ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. 2022 సంవత్సరానికి గాను పలు రంగాల్లో ఎంపికైన వారికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పురస్కారాలను అందజేశారు.
భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ కు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించగా.. ఆయన కుమార్తెలు తరణి, క్రితిక అందుకున్నారు. అలాగే సాహిత్యం, విద్యారంగంలో చేసిన కృషికి శ్యామ్ ఖేంకా ఎంపిక కాగా.. ఆయన తనయుడు అవార్డును స్వీకరించారు.
గణతంత్ర దినోత్సవం రోజున పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్రం. ఈసారి మొత్తం 128 మంది పద్మ పురస్కారాలకు ఎంపిక కాగా.. నలుగురికి పద్మ విభూషణ్ ప్రకటించింది. అలాగే 17 మందిని పద్మ భూషణ్, 107 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది.
సోమవారం మొత్తం ఇద్దరికి పద్మ విభూషణ్, 8 మందికి పద్మభూషణ్, 54 మందికి పద్మశ్రీ అవార్డులను అందజేశారు రాష్ట్రపతి. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పద్మభూషణ్ స్వీకరించారు. తెలంగాణకు చెందిన కిన్నెర మెట్ల కళాకారుడు దర్శనం మొగులయ్య పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఇక రెండో విడత అవార్డుల ప్రదానం ఈనెల 28న జరుగుతుంది.