రాజ్యంగం అమలులోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు భారత ప్రయాణం ఇతర దేశాలకు స్ఫూర్తిదాయకమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత్ ప్రయాణాన్ని దేశంలోని ప్రతి పౌరుడూ గర్విస్తాడని ఆమె అన్నారు. ప్రజాస్వామ్యానికి భారత్ మాతృదేశంగా పేరు గడించిందన్నారు.
రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా ఆమె జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రం చేపట్టిన ఆత్మనిర్బర్ భారత్, డిజిటల్ ఇండియా లాంటి పథకాలను ఆమె కొనియాడారు.
ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా భారత్ విజయవంతమైందని ఆమె పేర్కొన్నారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నేతృత్వం వహించినందుకు డా. బీఆర్ అంబేడ్కర్‌కు దేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ మనమంతా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పారు.
వలస రాజ్య పాలనలో పేదరికం, నిరక్షరాస్యత వంటి సమస్యలు మనల్ని వెంటాడయన్నారు. అయినప్పటికీ భారతీయుల స్ఫూర్తి చెక్కుచెదరలేదన్నారు. సరికొత్త ఆశలతో, ఆత్మవిశ్వాసంతో మనం ముందుకెళ్తున్నామన్నారు. దేశంలోని పలు మతాలు, భాషలు భారత్‌ను ఐకమత్యంగా ఉంచేందుకే కృషి చేశాయన్నారు.
కరోనా సంక్షోభం తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ గొప్పగా పుంజుకుందన్నారు. కేంద్రం తీసుకున్న చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాయన్నారు. కరోనా ప్రభావంతో దేశంలో పలు రంగాలు కుదుపునకు గురయ్యాయన్నారు. కేంద్ర నిర్ణయాల వల్ల సమయానుగుణంగా ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచిందన్నారు.