ఢిల్లీ ప్రభుత్వంలో ఇద్దరు ఎమ్మెల్యేలు..అతిషి, సౌరభ్ భరద్వాజ్ లను మంత్రులుగా నియమించడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. కేబినెట్ లో మంత్రులుగా వీరిని నియమించేందుకు వీరి పేర్లను ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ..లెఫ్టినెంట్ గవర్నర్ కు మొదట పంపారు. మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ రాజీనామా చేసిన అనంతరం ఆ లేఖలను కేజ్రీవాల్ రాష్ట్రపతికి పంపగా వాటిని ఆమె ఆమోదించారు.
దీంతో వీరి స్థానే అతిషి, సౌరభ్ భరద్వాజ్ లను మంత్రులుగా తీసుకోవాలని కేజ్రీవాల్ నిర్ణయించారు. వీరిద్దరూ రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 2020 నుంచి కల్కాజీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అతిషి.. లోగడ మనీష్ సిసోడియా నేతృత్వంలోని విద్యాశాఖ టీమ్ లో కీలక పాత్ర వహించారు.
2019 లోక్ సభ ఎన్నికల్లో ఆమె తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పోటీ చేసి గౌతమ్ గంభీర్ చేతిలో ఓడిపోయారు. ఇక సౌరభ్ భరద్వాజ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2013-14 లో ఆయన కేజ్రీవాల్ తొలి ప్రభుత్వంలో 49 రోజులపాటు రవాణా శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆప్ జాతీయ అధికార ప్రతినిధి కూడా అయిన భరద్వాజ్..గ్రేటర్ కైలాష్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో సిసోడియా, మనీలాండరింగ్ స్కామ్ లో జైన్ ఇద్దరూఇటీవల రాజీనామాలు చేశారు.