అయోధ్య రామ మందిర నిర్మాణానికి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విరాళల స్వీకరణకు శ్రీకారం చుట్టింది. తొలి విరాళాన్ని దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అందించారు. రామ జన్మభూమి ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్, వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ ఉదయం రాష్ట్రపతిని కలిశారు. అనంతరం కోవిండ్ రూ. 5,00,100 చెక్కును ప్రతినిధులకు ఇచ్చారు. రామ జన్మభూమి ట్రస్ట్‌తో పాటు విశ్వ హిందూ పరిషత్ కూడా మందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణను చేపట్టనుంది.
విరాళాల సేకరణలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీతో పాటు దేశంలోని ప్రముఖులను ఇరు సంస్థలకు చెందిన ప్రతినిధులు కలిసి విరాళాలు సేకరిస్తారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27వరకు సాగే విరాళాలను సేకరిస్తారు. దేశవ్యాప్తంగా 5 లక్షల గ్రామాల్లోని కోటి ఇళ్ల నుంచి విరాళాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.