నిర్భయ కేసులోని నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ ను పంపిన కొన్ని గంటల్లోనే పిటిషన్ రాష్ట్రపతి తిరస్కరణకు గురైంది. క్షమాభిక్ష పిటిషన్ తో పాటు ఆ పిటిషన్ ను తిరస్కరించమని కోరుతూ రాసిన లేఖను కూడా హోమ్ మంత్రిత్వ శాఖ రాష్ట్రపతికి పంపింది. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ కూడా తిరస్కరణకు గురి కావడంతో ఇక ఉరి శిక్ష అమలు చేయడమే మిగిలింది.
2012 డిసెంబర్ లో ఢిల్లీలో ఓ బస్సులో ఫార్మసీ విద్యార్దిని నిర్భయపై గ్యాంగ్ రేప్ చేసి కదులుతున్న బస్సు నుంచి కిందకు తోసేశారు. ఆమె స్నేహితుడిని కొట్టారు. ఈ సంఘటనతో కోమాలోకి వెళ్లిన నిర్భయ కొద్ది రోజులు చికిత్స పొందుతూ మృతి చెందింది. అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనలో నిందితులు రామ్ సింగ్, ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్ ను స్పెషల్ కోర్టు దోషులుగా తేల్చి ఉరి శిక్ష విధించింది. దోషుల్లో రామ్ సింగ్ జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. కింది కోర్టు తీర్పును హైకోర్టు, సుప్రీంకోర్టులు సమర్ధించాయి.
ఉరిశిక్ష విధించినప్పటికీ శిక్ష అమలు కాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ వెంటనే శిక్ష అమలు చేయాలని నిర్భయ తల్లిదండ్రులు ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. వీరి పిటిషన్ విచారించిన కోర్టు ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ఉరి తీయాలని తీర్పు నిచ్చింది. డెత్ వారెంట్ కూడా జారీ చేసింది. అయితే ఉరి శిక్ష అమలుకు 14 రోజుల ముందు దోషులకు ప్రభుత్వం నోటీసులివ్వాలి. ఈ లోపే దోషుల్లో ముఖేష్ కుమార్ సింగ్ రాష్ట్రపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ వెంటనే తిరస్కరణకు గురై ప్రభుత్వం నోటీసులిచ్చినా ఈ నెల 22న వారి ఉరిశిక్ష అమలు సాధ్యం కాదు.