రాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ ను ఎన్నికల సంఘం నేడు విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్టు ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు.
ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం జూలై 24తో ముగియనుంది. ఆర్టికల్ 62 ప్రకారం తదుపరి రాష్ట్రపతి జూలై25లోగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది.
రాష్ట్రపతిని ఎలక్టోరల్ సభ్యులు ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల గణంలో ఉభయ సభల్లోని ఎన్నికైన ఎంపీలు సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఉంటారు.
దేశ రాజధాని న్యూ ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన శాసన సభ సభ్యులకు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు రాజ్యాంగం అవకాశం కల్పించింది.