రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ నేతలు అంతా బిజీ అయ్యారు. ఎలాగైనా గెలవాలన్న కసితో బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఆదివాసీ మహిళ, మాజీ గవర్నర్ ద్రౌపతి ముర్మును ఖరారు చేశారు. వైసీపీ, బిజూ జనతాదళ్ పార్టీలు మద్దతు ప్రకటించడంతో ముర్ము విజయం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లే పడుతాయంటున్నారు. కానీ.. బీజేపీ మాత్రం రాష్ట్రపతి ఎన్నికలను ఏకగ్రీవం చేసేలా ప్రయత్నాలు చేస్తోంది.
రాష్ట్రపతి ఏకగ్రీవం ఎన్నిక కోసం ప్రయత్నాలు ప్రారంభించిన బీజేపీ అధిష్టానం.. ఆ బాధ్యతను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించింది. రంగంలోకి దిగిన నడ్డా.. ఇప్పటికే విపక్షాలకు చెందిన పలువురు నాయకులతో మంతనాలు జరిపారు జేపీ నడ్డా. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని జేడీఎస్ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడతో మాట్లాడారు. వీరితో పాటు కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి తో పాటు.. ఫరూక్ అబ్దుల్లాతో నడ్డా చర్చలు జరిపారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో రాజకీయం ఉండకూడదని.. ముర్ము ఏకగ్రీవానికి సపోర్ట్ చేయాలని కోరారు. మరోవైపు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము కూడా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే బిజూ జనతాదళ్, ఏఐడీఎంకే పార్టీలకు చెందిన నేతల్ని కలిసిన ముర్ము.. తనకు మద్దతునివ్వాలని కోరారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మద్దతు కోరేందుకు తనను కలువనున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలుస్తున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్డీయేతర పార్టీలను కలుస్తున్నారు యశ్వంత్ సిన్హా. తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే.. ఎన్డీయేతర పార్టీలు యశ్వంత్ కు ఎంతమేర మద్దతు ఇస్తాయో చూడాలంటున్నారు రాజకీయ పండితులు. అయితే.. ఇటీవల మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన విపక్షాల సమావేశానికి కాంగ్రెస్ హాజరుకావడంతో.. ఆప్, టీఆర్ఎస్ పార్టీలు హాజరుకాలేదు. దీంతో మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠగా మారింది.