సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. సీఎం జగన్ సానుకూలంగానే స్పందించారని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. టికెట్ ధరలకు సంబంధించి శుభంకార్డు పడిందని భావిస్తున్నామని తెలిపారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఇండస్ట్రీ సమస్యలపై చర్చించేందుకు టాలీవుడ్ ప్రముఖులు జగన్ తో సమావేశమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, నారాయణమూర్తి ఈ భేటీలో పాల్గొన్నారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రముఖులు. దేశవ్యాప్తంగా తెలుగు సినిమాల గురించి గొప్పగా ప్రచారం జరుగుతోందని… తెలుగులోనూ అధిక బడ్జెట్ సినిమాలు రావడం గొప్ప విషయమన్నారు చిరంజీవి. చిన్న సినిమాలకు ఐదో షో వేసుకునేందుకు జగన్ అంగీకరించినట్లు తెలిపారు. ఐదో షో వల్ల చిన్న సినిమా నిర్మాతలకు వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. చిరంజీవి తమను ముందుండి నడిపించారని మహేష్ బాబు, రాజమౌళి ప్రశంసించారు. సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఇంకో పది రోజుల్లో శుభవార్త వింటారని తెలిపారు. ఆరు నెలలుగా తెలుగు చిత్రపరిశ్రమ గందరగోళంగా ఉందని… ఏపీ సీఎం చొరవతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ చిన్న సినిమాలను బతికించాలని సీఎంను కోరినట్లు తెలిపారు. తర్వాత మంత్రి పేర్ని నాని మాట్లాడారు. ఎంతోమంది ఎన్నో మాట్లాడారు.. అన్నీ భరించాం.. అయితే.. ఇండస్ట్రీ బాగు కోసం చిరంజీవి ముందుకొచ్చారని చెప్పారు. సినీ పరిశ్రమ సమస్యలను ఏపీ సీఎం దృష్టికి చిరంజీవి తెచ్చారని అన్నారు. చిన్న సినిమాల మనుగడపై ప్రభుత్వం దృష్టికి తెచ్చారని చెప్పారు. నెలాఖరులోపు సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.