ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిఫ్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తాహ్ ఎస్‌సీసీ హాజరు కానున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైనట్టు కేంద్రం వెల్లడించింది. ఈ నెల 24న ఆయన ఢిల్లీకి చేరుకోనున్నారు. మరుసటి రోజు ఆయన ప్రధాని మోడీతో సమావేశం అవుతారు.
ప్రధాని మోడీతో ఆయన రక్షణ, ఆర్థిక రంగాల్లో పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ముఖ్యంగా ఆకాశ్, తేజోస్ వంటి తేలికపాటి యుద్ధ విమానాల కొనుగోలుపై ఈజిఫ్ట్ ఆసక్తి చూపిస్తోంది. ఈ అంశంపై ప్రధానితో భేటీ సమయంలో చర్చించే అవకాశం ఉంది.
అనంతరం ఆయన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్‌తో సమావేశమవుతారు. అదే రోజు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందులో ఆయన పాల్గొంటారు. పరేడ్‌లో పాల్గొనేందుకు 180 మంది సభ్యులతో కూడిన బృందం ఈ జిఫ్టు నుంచి భారత్ కు వస్తోంది.
ఈ సందర్భంగా 75 ఏండ్ల భారత్-ఈజిప్టు దౌత్య సంబంధాలకు గుర్తుగా స్మారక స్టాంపును విడుదల చేయనున్నారు. అనంతరం ఇరు దేశాల మధ్య కుదిరిన పలు ఒప్పందాల పత్రాలపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేసే అవకాశం ఉంది. ఈజిప్ట్ నుంచి ఓ నేత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. భారత రిపబ్లిక్ వేడుకలకు పశ్చిమ ఆసియా దేశాల నుంచి హాజరైన ఐదవ నేత అబ్దెల్ ఫత్తాహ్ ఎస్‌సీసీ.