అల్లర్లు, ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ లో నిత్యావసరాల ధరలు కొండెక్కిపోయాయి. మెయితీ, కుకీ తెగల మధ్య తలెత్తిన హింస ఫలితంగా మూడు వారాలుగా ఈ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ట్రక్కులను ఆందోళనకారులు అడ్డుకోవడంతో నిత్యావసరాల సరఫరా కూడా నిలిచిపోయింది. రవాణా దాదాపు స్తంభించిపోవడంతో రాష్ట్రంలో వీటికి కొరత ఏర్పడింది. దీంతో సరకుల ధరలను వ్యాపారులు విపరీతంగా పెంచేశారు. బియ్యం, ఉల్లిగడ్డలు, కోడిగుడ్లు, ఆలుగడ్డలు వంటివాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఇటీవలి వరకు 50 కేజీల బియ్యం ధర రూ. 900 ఉండగా ఇప్పుడిది 1800 రూపాయలకు చేరింది. 30 కోడిగుడ్లతో ఉన్న క్రేట్ ధర 300 రూపాయలకు పెరిగింది. లోగడ దీని ధర 180 రూపాయలుండేది. అలాగే వంట గ్యాస్ సిలిండర్ 1800 రూపాయలకు అమ్ముతుండగా లీటరు పెట్రోలు ధర 170 అయింది. బంగాళాదుంపలు కేజీ వంద రూపాయలు పలుకుతోంది.
అల్లర్లు జరగని జిల్లాల్లో కూడా దీని ప్రభావం పడింది. ఇంఫాల్ లో విపరీతంగా ఇలా నిత్యావసరాల ధరలను పెంచడం చూసి ఇతర చోట్ల కూడా వ్యాపారులు బ్లాక్ మార్కెట్ లో వీటిని అత్యధిక ధరలకు అమ్ముతున్నారు. మొదట ఈ నెల 3 న ఆందోళనలు ప్రారంభమయ్యాయి. హింసాత్మక ఘటనల్లో 70 మందికి పైగా మరణించగా పలువురు గాయపడ్డారు. నిరసనకారులు ఇళ్ళు, షాపులను దోచుకున్నారు.
వాహనాలకు నిప్పు పెట్టారు . దీంతో 8 జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ ప్రకటించింది. ఒక దశలో కనిపిస్తే కాల్చివేతకు కూడా గవర్నర్ ఆదేశించారు. అయితే కొన్నాళ్ళు స్తబ్దంగా ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో మళ్ళీ ఇటీవల హింస చెలరేగింది. నిన్న రాత్రి బిష్ణుపూర్ జిల్లాలో ప్రజా పనుల శాఖ మంత్రి గోవిందాస్ కాంతోజం ఇంట్లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. గుంపుల హింసలో ఒకరు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ జిల్లాలో తాత్కాలికంగా కర్ఫ్యూ విధించారు.