కులాల సృష్టి మతగురువులు, పురోహితులదేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అంతే తప్ప భగవంతుడు సృష్టించినవి కావన్నారు. యోగి శిరోమణి రోహిదాస్ 647 వ జయంతిని పురస్కరించుకుని ముంబైలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. దేశంలో అందరి మనస్సాక్షులు ఒకటేనని, కానీ అభిప్రాయాలు వేర్వేరుగా ఉంటాయని చెప్పారు. మన మనుగడను ప్రారంభించినప్పుడు సమాజం పట్ల మనకు బాధ్యత కూడా ఉంటుందని, ప్రతి పని సమాజ హితం కోసమే అనుకున్నప్పుడు అది చిన్నదా లేక పెద్దదా అని ఎలా విభజిస్తామని ఆయన ప్రశ్నించారు.
మనమంతా సమానమేనని, కులం, వర్గం అన్నవేవీ లేవని, మన గురువులే వీటిని సృష్టించారని చెప్పిన ఆయన.. ఇది తప్పని వ్యాఖ్యానించారు. యోగి రోహిదాస్… తులసీదాసు, కబీర్ దాసు, సూర్ దాసు కన్నా గొప్పవారని, అందుకే ఆయనను శిరోమణిగా అభివర్ణిస్తున్నామని మోహన్ భగవత్ పేర్కొన్నారు.
శాస్త్రాల్లో ఆయన బ్రాహ్మణులపై విజయాన్ని సాధించలేకపోయినా అనేకమంది హృదయాలను గెలుచుకోగలిగారని, వారికి భగవంతుని పట్ల విశ్వాసం కలిగించగలిగారని భగవత్ అన్నారు. మీ మతం ప్రకారం సమాజానికి సేవ చేయాలని రోహిదాస్ సూచించేవారని, ఇదే మత ప్రాతిపదికకు మూలమవుతుందని ఆయన చెప్పారు.
సత్యం, అభిమానం, అంతర్గత స్వచ్చత, అవిరళ కృషి అన్న నాలుగు ‘మంత్రాలను’ రోహిదాస్ సమాజానికి ప్రబోధించారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మతాన్ని వీడరాదని కూడా ఆయన సూచించారని మోహన్ భగవత్ పేర్కొన్నారు.