ఇండియా కరోనా నిర్మూలనకు కంకణం కట్టుకుంది. మనం అందరం ఐక్యంగా కరోనాను ఎదుర్కొంటున్నాం అని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన సమయం ఇది. కాబట్టి ఏప్రిల్ 9న తొమ్మిది నిమిషాల పాటు విద్యుత్ వెలుగులు బంద్ పెట్టి, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్ల వెలుగుల్లో మనమంతా ఐక్యంగా ఉన్నాం అన్న సందేశాన్ని ఇద్దాం అంటూ ప్రధాని మోడీ దేశానికి పిలుపునిచ్చారు.
అయితే, ఒక్కసారిగా కరెంట్ వ్యవస్థ దేశవ్యాప్తంగా స్విచ్ ఆఫ్ అయితే… విద్యుత్ గ్రిడ్స్ దెబ్బతింటాయా…? వ‌్యవస్థ కుప్పకూలి పోయే ప్రమాదం ఉందా…? మోడీది గుడ్డి నిర్ణయమా…? అందులో స్పూర్తి ఎంతా…? ఇలా రకరకాల ప్రశ్నలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. అయితే… ఎప్పట్లాగే ఇక్కడా విభిన్న వాదనలున్నాయి. అవేవో మీరూ చదవండి…
దేశమంతా అకస్మాత్తుగా విద్యుత్ వాడకం బంద్ చేస్తే గ్రిడ్ కుప్పకూలుతుంది. ఒక్కో రాష్ట్రంలో పునరుద్ధరించుకుంటూ రావాల్సి ఉంటది. మొత్తం కొన్ని రోజులు పడే అవకాశం ఉంది. అప్పటి వరకు అందరూ చీకట్లోనే ఉండాల్సి వస్తది. ఏ క్షణానికి ఆ క్షణం డిమాండ్ ఎంత ఉందో అంతే సప్లై చేస్తూ 24 గంటలు కంటికి రెప్పలా గ్రిడ్ ని లోడ్ డిస్పాచ్ సెంటర్ ఇంజినీర్లు కాపాడుతూ ఉంటారు. డిమాండ్ కన్నా సరఫరా పెరిగినా, తగ్గినా గ్రిడ్ కూలి దేశం అంతా అంధకారం అవుతుంది. ఏ క్షణాన డిమాండ్ ఎంత ఉందో అంతే విద్యుత్ ఉత్పత్తి చేసేలా పవర్ ప్లాంట్స్ ను నిర్వహిస్తూ ఉంటారు. డిమాండ్ బాగా తగ్గిపోతే పవర్ ప్లాంట్స్ ను బ్యాక్ డౌన్ చేయడం లేదా షట్ డౌన్ చేయడం జరుగుతుంది. ఒక వేళ థర్మల్ పవర్ ప్లాంట్ ని షట్ డౌన్ చేస్తే మళ్ళీ పీక్ లోడ్ కి జనరేషన్ చేరే వరకు 12 గంటల సమయం పడుతుంది.
లాక్ డౌన్ తో దేశంలో డొమెస్టిక్ వినియోగం, అత్యవసర సేవల విద్యుత్ వినియోగం మాత్రమే ఉంది. రాత్రి పూట అత్యవసర సేవలు కూడా బంద్. డొమెస్టిక్ వినియోగం మాత్రమే ఉంటది. అది కూడా అకస్మాత్తుగా బంద్ పెడితే గ్రిడ్ ఏమీ కావాలి ? ముందు చూపు లేని ఇలాంటి సలహాలు ఎవరిస్తారు ? ఏదైనా చెప్పే ముందు వాటి పర్యవసానాలు తెలుసుకోరా ? ఇప్పటికే పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య రంగాల విద్యుత్ వినియోగం సున్నకు చేరడంతో, దేశ వ్యాప్తంగా ఇప్పటికే తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉన్న డిస్కంలు మరింత కుంగిపోవా ?
అయితే, దీన్ని వ్యతిరేకించే వారు ఏమంటున్నారో చూడండి…
ప్రధాన మంత్రి పిలుపు మేరకు లైట్లు బందు పెడితే మొత్తం దేశ విద్యుత్ గ్రిడ్ కుప్పకూలు తుందని, దేశం మొత్తం అంధకారంలోకి పోతుందనీ, ఇంత తెలివి లేని ఆలోచనలు ఎలా చేస్తారని కొంతమంది పోస్టులు పెడుతున్నారు. ఇది వారి అవగాహనా రాహిత్యం మాత్రమే…
?దేశంలో అన్ని రంగాల విద్యుత్ డిమాండులో గృహ వినియోగం కేవలం 20-25% మాత్రమే…ఇందులో ఎక్కువ భాగం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, గీజర్లు, వాషింగ్ మెషిన్లు, కంప్యూటర్లు, టీవీలు…వీటి వినియోగమే ఉంటుంది. కేవలం లైట్ల వినియోగం మొత్తం విద్యుత్ వినియోగంలో 5-10% కూడా ఉండదు. ఇందులో వీధి దీపాల వినియోగం తీస్తే లైట్ల వినియోగం మరింత తక్కువగా ఉంటుంది. రాత్రి 11 గంటల తరువాత సాధారణ రోజుల్లో కూడా ఎక్కడా లైటింగ్ లోడ్ ఉండదు. ఇటీవలి కాలంలో incandescent లైట్ల (బుగ్గ బల్బుల) వినియోగం బాగా తగ్గింది. విద్యుత్తును బాగా తక్కువగా ఉపయోగించే ఎల్‌ఈడిలు, ట్యూబ్ లైట్ల వినియోగం బాగా పెరిగింది. విద్యుత్ సంస్థలకు ఈ మాత్రం లోడ్ మేనేజ్ చేయడం పెద్ద కష్టం కాదు.
కాబట్టి కేవలం లైట్లు బందు పెడితే గ్రిడ్ కుప్ప కూలుతుందనే మాట పూర్తిగా అబద్దం.
కాకుంటే కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి…
1. ప్రధాని లైట్లు బందు పెట్ట మన్నారు కానీ వీధి దీపాలు కాదు.
మరో విషయం…9 నిమిషాలు ఇంట్లో దీపాలు, వీధిదీపాలు బందు పెడుతున్నారని ముందే తెలిస్తే దొంగలూ ప్లాన్ చేసుకొని మరీ దొంగ తనాలు చేసే ప్రమాదం ఉంది.
9 నిమిషాలు…అదీ రాత్రి సమయాల్లో వీధులు అంధకారంలో ఉంటే అత్యవసర డ్యూటీల్లో బయట ఉండే పోలీసులకు, డాక్టర్లకు, ఇతర సిబ్బందికి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి విద్యుత్ సంస్థలు, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో వీధిదీపాలు ఆర్పకుండా చూడాలి.
2. ప్రధాని దీపాలు వెలిగించమన్నారు కానీ కాగడాలు కాదు….కాగడాలు పట్టుకొని వీధుల్లో తిరిగితే మరిన్నీ ప్రమాదాలు జరుగుతాయి…
3. కేవలం దీపాలు వెలిగించండి….టపాసులు కాదు…అసలే ఎండా కాలం., పేదల గుడిసెలు అంటుకునే ప్రమాదం ఉంది…నీళ్ళు దొరకడం కూడా కష్టం…
ప్రధాని పిలుపులోని స్ఫూర్తినీ అర్దం చేసుకోండి. దానిని ఒక జాతరలా చేసి అపహాస్యం చేయకండి. సాధ్యమైతే స్థోమత ఉన్న ప్రతీ కుటుంబం ఒక పేద కుటుంబాన్ని దత్తత తీసుకొని లాక్ డౌన్ ముగిసే వరకూ భోజనం పెట్టండి.
అయితే, దీనిపై విద్యుత్ సంస్థల ప్రతినిధులు, నిపుణులు స్పష్టతనిస్తే కానీ ప్రశ్నలు ఆగేలా లేవు.