ప్రపంచంలోని దేశాధినేతలంతా ముందుగా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ వ్యాక్సిన్ సేఫ్ అని చెప్పే ప్రయత్నం అది. కానీ భారత్ లో ప్రధాని మోడీ ముందుగా వ్యాక్సిన్ తీసుకోకపోయే సరికి వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. మరోవైపు అస్ట్రాజెనికా-ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ వ్యాక్సిన్ కోవిషీల్డ్ పై పెద్దగా ఎవరూ అభ్యంతరం చెప్పకపోయినా… భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాక్జిన్ పై ఎయిమ్స్ వైద్యులు సహా పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.
వ్యాక్సినేషన్ ప్రారంభానికి ముందే కోవిషీల్డ్, ఫైజర్ టీకా మినహా మిగతావన్నీ మంచినీళ్లే అంటూ సీరం సీఈవో ఆధార్ పునావాలా వ్యాఖ్యానించటం, ఫేజ్-3 ట్రయల్స్ పూర్తికాక ముందే అత్యవసర వ్యాక్సినేషన్ కు అనుమతివ్వటంతో కోవాక్జిన్ పనితీరుపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
అయితే, వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత కోవాక్జిన్ వేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. అయినా… ఎక్కడో చిన్న అనుమానాలు వచ్చాయి. కానీ ప్రధాని మోడీ ఢిల్లీ ఎయిమ్స్ లో వ్యాక్సిన్ తీసుకున్నారు. అది కూడా కోవాక్జిన్. దీంతో విమర్శలకు చెక్ పెట్టేందుకే ప్రధాని మోడీ ఈ వ్యాక్సిన్ తీసుకున్నారని, ఇక నుండి కోవాక్జిన్ పై ఉన్న అపోహాలు తొలిగిపోతాయని వైద్య నిపుణులు భావిస్తున్నారు.