– అటు బైపోల్.. ఇటు కేసీఆర్ జాతీయ పార్టీ
– 11న హైదరాబాద్ కు ప్రధాని
– మోడీ టూర్ పై సర్వత్రా ఆసక్తి
మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. ఈ నెల 7న నోటిఫికేషన్.. 14న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ.. 15న నామినేషన్ల పరిశీలన.. నవంబర్ 3న ఎన్నిక జరగనుంది. 6న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. అయితే, నోటిషికేషన్ వచ్చి.. అభ్యర్థులు నామినేషన్ల హడావుడిలో ఉన్న సమయంలో ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ కన్ఫామ్ అయింది.
మునుగోడులో బీజేపీ జెండా ఎగురుతుందని ధీమాగా ఉన్నారు ఆపార్టీ నేతలు ఇప్పటిదాకా ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి చేరికతో విజయం కన్ఫామ్ అని గట్టిగా నమ్ముతున్నారు. ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈనెల 11న హైదరాబాద్ కు వస్తున్నారు ప్రధాని మోడీ. హెచ్‌ఐసీసీలో జరిగే ఐక్యరాజ్యసమితి సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఓవైపు బైపోల్, ఇంకోవైపు కేసీఆర్ జాతీయ పార్టీ అనౌన్స్ మెంట్.. ఈ పరిస్థితుల్లో ప్రధాని రావడం ఆసక్తికరంగా మారింది.
ప్రధాని అధికారిక కార్యక్రమానికే పరిమితం అవుతారా? లేక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అసలే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా పరిస్థితి నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎండగడుతూ వచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. దసరా రోజున జాతీయ పార్టీని ప్రకటించేందుకు సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని హైదరాబాద్ పర్యటనలో పార్టీ కార్యక్రమాల షెడ్యూల్ కూడా ఉండవచ్చు అనే చర్చ సాగుతోంది. పైగా ఆయన వచ్చే సమయానికి మునుగోడుకు కూడా నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది.
ఈ నెల 10 నుంచి 14 వరకు హైదరాబాద్ లోని హెచ్‌ఐసీసీ వేదికగా యునైటెడ్ నేషన్స్ వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్(UNWGIC 2022) సదస్సు జరగనుంది. 11న ఈ సదస్సులో పాల్గొననున్నారు మోడీ. ఎయిర్ పోర్ట్ లో బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగం ఉంటుందని ప్రచారం మొదలైంది.